ఓపెన్ దందా..!
– ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో యథేచ్చగా కాపీయింగ్
– ఇన్విజిలేటర్లే విద్యార్థులకు స్లిప్పులు అందిస్తున్న వైనం
ధర్మవరం : ఓపెన్ స్కూల్ (సార్వత్రిక విద్యాపీఠం ) పరీక్షలు మూడు చూచిరాతలు.. ఆరు చీటీలుగా జరుగుతున్నాయి.. వీటిని నిరోధించాల్సిన ఇన్విజిలేటర్లు ఓపెన్ స్కూళ్ల యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వారి దందా అడ్దూ అదుపులేకుండా జరుగుతోంది. జిల్లాలో ధర్మవరం, అనంతపురం, తాడిపత్రి, గుత్తి, కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గంలో ఇంటర్, టెన్త్ ఓపెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఒక్క సెంటర్‌లో కూడా నిబంధనల మేరకు పరీక్షలు జరగడం లేదు. చాలా సెంటర్లలో ఇన్విజిలేటర్లే పరీక్షలు రాస్తూ, విద్యార్థులకు చీటీలు అందిస్తున్నారు.
కొంత మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాకపోతే వారే నేరుగా పరీక్షలు రాస్తుండటం విశేషం. పకడ్బందీగా జరగాల్సిన ఈ పరీక్షలను కేవలం చూసిరాతల పరీక్షలుగా జరుగుతున్నాయి. ఏకంగా ఓపెన్ స్కూళ్ల నిర్వహకులే ఇన్విజిలేటర్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులకు చీటీలను అందిస్తున్నారు. అలాగే ఇన్విజిలేటర్లను పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు ఓపెన్‌స్కూళ్ల నిర్వాహకులు మహారాజుల్లా చూసుకుంటున్నారు. వారి దందాకు సహకరించని ఇన్విజిలేటర్లను సెల్‌ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో లొంగదీసుకుంటున్నారు.
అడ్మిషన్ రోజే పాస్ గ్యారెంటీ హామీ
జిల్లాలో ఓపెన్‌స్కూళ్ల దందా మితిమీరిపోతోంది. అడ్మిషన్‌కు రోజే వారితో పరీక్షలు చూసి రాసేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. పాస్ గ్యారెంటీ హామీతోనే అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. పరీక్ష మీరే రాస్తే.. ఒక లెక్క.. వేరొకరు రాస్తే ఒక లెక్క.. ఈ మేరకు ఓపెన్‌స్కూళ్ల నిర్వహకులు అందుకు కావాల్సిన మొత్తాన్ని పరీక్ష ఫీజు కట్టించుకునే రోజే తీసుకుంటుండటం జగమెరిగిన సత్యం. రూ.5,000 నుంచి రూ.10,000 దాకా అదనపు ఫీజులు వసూలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఇన్విజిలేటర్లు కనీసం మీడియాను కూడా అనుమతించకుండా పరీక్షలు రాయిస్తుండటం విశేషం. కాగా ఇలా పరీక్షలు నిర్వహించడం వల్ల రెగ్యులర్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే ఇలాంటి అక్రమాలు నివారించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన జంబ్లింగ్ పద్ధతిని నిర్వాహకులు ఈ పద్దతిని క్షేత్రస్థాయిలో అమలు జరగనియ్యడం లేదు. ఏకంగా ఆయా స్కూళ్ల నిర్వహకులు తలా ఓ సెంటర్‌ను పంచుకుని పిల్లలందరినీ ఒకే దగ్గర కూర్చోపెట్టి పరీక్షలు రాయిస్తున్నారు.