మోసపుచ్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
– నాసిరకం వేరుశనగతో రైతు నోట్లో మట్టికొడుతున్నారు
– విత్తన పరిశీలనలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ విమర్శ
అనంతపురం అగ్రికల్చర్ : మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య అని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో జరుగుతున్న విత్తన పంపిణీ, విత్తన నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చెప్పింది చేతల్లో చూపే వ్యక్తి కాదన్నారు. ఇప్పటివరకు ఎటువంటి సన్నాహాలు చేయకుండానే ఇన్‌పుట్‌సబ్సిడీ, బీమా జూన్ 2 నుంచి 8లోగా రైతులకు పంపిణీ చేస్తామని ప్రకటించడమే అందుకు నిదర్శనమన్నారు.
వేరుశనగ కాయలు చూస్తే విత్తడానికేనా లేక కమిషన్, దళారుల కోసమా అని అనుమానం వస్తోందన్నారు. నాసిరకం, బొటికలు, రాళ్లలో నిండిన కాయలు చాలా దారుణంగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన విత్తనం 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలని, నాలుగు బస్తాలు కాకుండా రైతుకు అవసరమైనన్నీ ఇవ్వాలని, ఇన్‌పుట్, బీమా పరిహారం తక్షణం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సి.మల్లికార్జున, నాయకులు శింగనమల గోపాల్, బుక్కరాయసముద్రం నారాయణస్వామి, రామక్రిష్ణ, లక్ష్మీనారాయణరెడ్డి, సుధాకర్, శివయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.