
'రాష్ట్ర మంత్రులు వచ్చినా చీపుర్లతో తరిమికొట్టండి'
విజయనగరం : ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం రాష్ట్ర మంత్రులు, అధికారులు ఎవరొచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో 10 ప్రజా సంఘాలతో బహిరంగసభ మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ మాట్లాడుతూ.. ఎయిర్ పోర్టు భూసేకరణ కోసం ఎవరు వచ్చినా చీపుర్లతో తరిమి కొట్టాలని ప్రజలకు, రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, వైఎస్ఆర్ సీపీ మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు బహిరంగ సభకు హాజరయ్యారు. రైతులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా, అధికార ప్రభుత్వ ధోరణి మాత్రం మారలేదు. నోటిఫికేషన్ విడుదల చేస్తే తన భూమి కోల్పోవాల్సి వస్తుందని భయపడి సూరి అనే ఓ రైతు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.