- సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
బత్తలపల్లి: స్థానికులను కాదని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరీ చేయించుకోవడమేకాక కూలి అడిగినందుకు ఎస్‌ఏ రావతార్ యాజమాన్యం దాడులు చేస్తే మానవత్వంతో స్థానికులు స్పందించారేగానీ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టించుకోలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎస్‌ఏ రావతార్ ఫ్యాక్టరీలో అక్రమంగా తొలగించిన 183 మంది కార్మికులను పనిలోకి తీసుకోవాలని కోరుతూ వారికి సంఘీభావంగా చేపట్టిన పాదయాత్ర బృందం సోమవారం బత్తలపల్లికి చేరుకుంది. వీరికి స్వాగతం పలుకుతూ రాంభూపాల్ బత్తలపల్లికి విచ్చేశారు. అనంతరం ఆయన బహిరంగసభలో మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గంలోని పరిగి మండలంలో ఎస్‌ఏ రావతార్ ఫ్యాక్టరీలో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు సమస్యలు పరిష్కరించుకునేందుకు యూనియన్ పెట్టుకునే ప్రయత్నం చేయడంతో కార్మికులను అన్యాయంగా తొలగించారన్నారు. కలెక్టరేట్ ఎదుట ఈ నెల 21నుంచి తలపెట్టిన నిరవధిక దీక్షలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, రైతు సంఘం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎస్‌హెచ్ బాషా, పట్టణ కార్యదర్శి పోలా లక్ష్మినారాయణ, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జేవీ రమణ, అధ్యక్షుడు ఎల్.ఆదినారాయణ, గొట్లూరు రాముడు, హైదర్‌వలీ, ఖాదర్‌బాషా, రమణ, మండల కార్యదర్శి వడ్డె రమేష్, హమాలీ యూనియన్ నాయకులు మందల క్రిష్టా, మధ్యాహ్నభోజన ఏజెన్సీ నిర్వాహకురాలు లక్ష్మిదేవి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాగార్జున, సాయికుమార్, కాశీం తదితరులు పాల్గొన్నారు.