మిధున్‌రెడ్డి
–వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకొంది
–ఎంపీ మిధున్‌రెడ్డి వెల్లడి
బి.కొత్తకోట: ఉద్యోగులకు కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేసేలా కేంద్రంతో పోరాటం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించిందని రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ.మిధున్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై పార్టీ ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. చిత్తూరుజిల్లా బి.కొత్తకోటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దుకు టీడీపీ ప్రభుత్వం కేంద్రం వద్ద గట్టిగా వాదించలేకపోతోందని అన్నారు. ఈ విధానంవల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, ఇప్పటికే సమస్యపై పార్టీ చర్చించి ఉద్యోగులకు అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కడప–బెంగళూరు రైల్వేలైను పనులకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైల్వేమార్గానికి కేంద్ర, రాష్ట్రాలు 50శాతం నిధులు భరించాల్సివుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పనుల్లో తీవ్ర జాప్యం నెలకొందని అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించానని అన్నారు. విభజన హామీల అమలు కోసం ప్రభుత్వం కేంద్రంవద్ద నోరువిప్పే పరిస్థితుల్లో లేదని అన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు.