మంత్రి వ్యాఖ్యలపై దుమారం
మంగళగిరి: సీఆర్‌డీఏ పరిధిలోని డిప్యూటీ కలెక్టర్లను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు సీఆర్‌డీఏ అధికారుల్లో దుమారం లేపుతున్నాయి. ఈనెల 26న గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో మంత్రి రైతులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు గ్రామకంఠాలపై నిలదీయడంతో మంత్రి.. ప్రభుత్వానికి తెలియకుండా డిప్యూటీ కలెక్టర్లే గ్రామకంఠాల జాబితాలను ప్రకటించారని, మా రైతులు మంచివారు కాబట్టి ఊరుకున్నారని, లేకుంటే డిప్యూటీ కలెక్టర్లను చెట్టుకు కట్టివేసి కొట్టేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఒక డిప్యూటీ కలెక్టర్ కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయనట్టు సమాచారం.
మంత్రి వ్యాఖ్యలపై సీఆర్‌డీఏ అధికారులు తమ సంఘ సమావేశంలో.. మంత్రులు చెప్పినట్లు తాము సహకరిస్తున్నా రైతుల మెప్పుకోసం తమను కించపరచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు మూకుమ్మడి సెలవు పెట్టి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు.