తుళ్ళూరు : రహదారుల వెంట ఆక్రమణల తొలగింపులో అధికారులు అడ్డగోలుగా మార్కింగ్ చేయడంతో పలువురు నివాసాలు కోల్పోయి వీధిన పడుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రమైన తుళ్ళూరులో ఆక్రమణల తొలగింపునకు సీఆర్‌డీఏ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు రాజధాని గ్రామాలను సుందరీకరణ చేయాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు తుళ్ళూరు మండలంలోని పెదపరిమి, మందడం, వెలగపూడి, రాయపూడి గ్రామాలలో రహదారుల వెంట వున్న ఆక్రమణలను సీఆర్‌డీఏ అధికారులు తొలగించారు.
మండలకేంద్రమైన తుళ్ళూరులో గత వారం రోజులుగా జరుగుతున్న ఆక్రమణల తొలగింపు వివాదాలకు దారి తీసింది. తుళ్ళూరు ఎస్సీ కాలనీలో రెవెన్యూ సర్వేయర్ల తప్పుడు లెక్కలతో నాలుగు అడుగులు ఎక్కువ దూరం మార్కింగ్ ఇవ్వడంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గత 50 సంవత్సరాలుగా పంచాయితీకి పన్నులు కూడా కడుతున్నామని, అధికారులు వచ్చి ఈ స్థలాలు ప్రభుత్వానివేనంటూ నివాసాలు తొలగించారని కాలనీకి చెందిన వృద్ధురాలు మరియమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.
తమకు ఉన్న గూడు పడగొట్టారని, తాను ఎలా బతకాలని ఆమె రోదిస్తోంది. స్థానికులు అధికారులను నిలదీయడంతో సోమవారం మరోసారి సర్వే చేసిన అధికారులు పొరపాటు జరిగిందంటూ పాత మార్కింగ్‌ను కొట్టివేసి, నాలుగు అడుగులు వెనక్కి కొత్తగా మార్కింగ్ ఇచ్చారు. దీంతో తప్పుడు మార్కింగ్‌తో తాము ఇళ్లు కోల్పోయామని పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు.
చెండాచెట్టు కూడా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయం చూపాలని తుళ్ళూరు ముస్లింలు అధికారులను కోరుతున్నారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదలను అర్ధంతరంగా ఖాళీచేయిస్తే వారు ఎలా బతకాలని వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ నాయకుడు కత్తెర సురేష్‌కుమార్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు మానవతా ధర్మంతో బాధితులను ఆదుకోవాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు : తహశీల్దార్
దీనిపై తుళ్ళూరు తహశీల్దార్ సుధీర్‌బాబును వివరణ కోరగా సాధ్యమైనంత వరకు అందరికీ ముందస్తు సమాచారం ఇచ్చామని, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. ఎవరికైనా సొంతస్థలాలు, ఆస్తుల నష్టం జరిగితే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రీ సర్వే చేయిస్తామని వివరణ ఇచ్చారు.
అడ్డగోలు మార్కింగ్‌లతో ఇళ్ల కూల్చివేత
Published Wed, Jun 22 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement