సీఎంతోనే తేల్చుకుంటా
– వలస నేతతో సమన్వయంపై మాజీ మంత్రి శిల్పా
నంద్యాల: పార్టీలో కొత్తగా చేరిన నేత, ఆయన వర్గీయులతో కలిసి పని చేసే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి, టీడీపీ ఇన్‌చార్జి శిల్పామోహన్‌రెడ్డి చెప్పారు. స్థానిక శిల్పా సహకార్‌లో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కొత్తవారు చేరడంతో గందరగోళ పరిస్థితినెలకొందని, కార్యకర్తలు కలిసి పని చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆయనతో సమన్వయం కుదరకపోవడంతో మంత్రులు వద్ద కాకుండా నేరుగా చంద్రబాబునాయుడినే కలిసి చర్చిస్తానని చెప్పారు.
ప్రజల వద్దకు వెళ్లలేకున్నాం:
అధికార పార్టీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఎలాంటి పనులు చేయలేకపోయామని, ప్రజల వద్దకు వెళ్లలేకపోతున్నామని కౌన్సిలర్లు జాకీర్, అనిల్ అమృతరాజ్, మాజీ కౌన్సిలర్ పున్నాశేషయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ఇచ్చినా ఇప్పటి వరకు మంజూరు కాలేదని, మళ్లీ జనచైతన్య యాత్రల పేరిట ప్రజల వద్దకు వెళ్లలేమని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పింఛన్లను రూ.200 పెంచడంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారని, కాని టీడీపీ పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచినా ప్రజల్లో ఎలాంటి ఆదరణ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దేశలం సులోచన, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పీపీనాగిరెడ్డి, టౌన్ టీడీపీ అధ్యక్షుడు ఇషాక్, మండల టీడీపీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ కైపరాముడు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.