క్యాంపస్ కొలువులు డీలా!
క్యాంపస్ కొలువులు డీలా!
Published Sun, Nov 22 2015 2:27 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM
గతంతో పోలిస్తే ఈసారి సగానికి తగ్గిన ఐటీ కంపెనీల నియామకాలు
* 2012-13లో 23 వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు
* ఈ ఏడాది కేవలం 11 వేల మంది విద్యార్థులకే కొలువులు
* ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్య అందకపోవడమే కారణం
* ఆఫ్ క్యాంపస్ నియామకాలవైపు విద్యార్థుల పరుగులు
(సాక్షి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో గత మూడేళ్లుగా జోరుగా సాగిన క్యాంపస్ కొలువులు ఈ ఏడాది డీలాపడ్డాయి. ఐటీ కంపెనీలు ఆశించిన స్థాయిలో విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు కనిపించకపోవడంతో ఈసారి నియామకాలు సగానికి సగం తగ్గాయి. 2012-13, 2013-14, 2014-15 సంవత్సరాల్లో వరుసగా 23 వేలు, 21 వేలు, 18 వేల మంది విద్యార్థులు క్యాంపస్ కొలువులు చేజిక్కించుకోగా ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి క్యాంపస్ నియామకాల ద్వారా కేవలం 11 వేల మందికి (బ్యాచ్ 2015-16) మాత్రమే ఉద్యోగాలు లభించాయి. గతేడాది స్థానిక అగ్రశేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో నియామకాలు చేపట్టిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఈ ఏడాది ఐఐటీ, ఎన్‌ఐటీలకే పరిమితమవగా గత సంవత్సరం దాకా హైదరాబాద్‌లోని ద్వితీయశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టిన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్, టెక్ మహేంద్ర వంటి ఐటీ కంపెనీలు ఈసారి అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో నియామకాలకే పరిమితమయ్యాయి.
ఈ కారణంగానే ఈ ఏడాది క్యాంపస్ నియామకాల సంఖ్య భారీగా తగ్గిందని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఏటా అక్టోబర్ చివరి నాటికే 95 శాతం క్యాంపస్ నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తరువాత వచ్చే కంపెనీలు చేపట్టే నియామకాలు ఐదు శాతానికి మించవని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ లెక్కన ఇంకో వెయ్యి మంది విద్యార్థులకు మించి అవకాశం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నాణ్యత లేకపోవడమే...
రాజధాని హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోవడం వల్లే ఆయా కాలేజీల్లో నియామకాల ప్రక్రియకు ఐటీ కంపెనీలు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. గత మూడేళ్లలో సగటున 56 ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ఈ ఏడాది సగానికిపైగా తగ్గించి కేవలం 26 కాలేజీలకే పరిమితమయ్యాయి. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ మొత్తం విద్యార్థుల్లో 63 నుంచి 75 శాతం మందికే క్యాంపస్ నియామకాల ద్వారా ఉద్యోగాలు లభించాయి. అందులోనూ కొంత మంది విద్యార్థులకు నాలుగు నుంచి ఐదు కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా, జెఎన్‌టీయూహెచ్ సహా టాప్ ఐదు కాలేజీల్లో సగటున 23 శాతం మంది విద్యార్థులు నాలుగైదు కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. ‘క్యాంపస్ నియామకాల కోసం విద్యార్థుల ప్రతిభను పరీక్షించేందుకు కఠినమైన ప్రశ్నపత్రం ఉంటుంది. అందువల్ల తెలివైన విద్యార్థులు మాత్రమే రాత పరీక్ష పాసవుతున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి ఆంగ్ల భాషలో పరిజ్ఞానం లేకుంటే వెనక్కి వెళ్లక తప్పదు’ అని అనేక ఐటీ కంపెనీలకు ఆన్‌లైన్ క్యాంపస్ పరీక్ష నిర్వహించే అమ్‌క్యాట్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ఐటీ కంపెనీలను బతిమాలుతున్న కాలేజీలు...
టాప్ ఐటీ కంపెనీలు క్యాంపస్ నియామకాల కోసం వస్తే అడ్మిషన్లు పెరుగుతాయని భావిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఇందుకోసం ఐటీ కంపెనీల హెచ్‌ఆర్ విభాగాలను బతిమాలుతున్నాయి. కాలేజీల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి 10, 15 కాలేజీలకు కలిపి ఒకేచోట పరీక్షలు నిర్వహించి రెండంకెలకు మించకుండా విద్యార్థులకు ఐటీ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ‘మేము గతేడాది ఎక్కువ కాలేజీలకు వెళ్లి నియామకాలు చేపట్టినా ఎంపికైన వారిని ఇప్పటికీ శిక్షణకు పిలువలేకపోయాం. అందువల్ల ఈ ఏడాది కొంత మేర క్యాంపస్ నియామకాలు తగ్గించుకున్నాం’ అని విప్రో హెచ్‌ఆర్ విభాగం ప్రతినిధి చెప్పారు.
‘క్యాంపస్ నియామకాలకు ఆహ్వానిస్తూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 128 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి మాకు వినతులు వచ్చాయి. కానీ మేము 18 కాలేజీల్లోనే నియామకాల ప్రక్రియ చేపట్టాం’ అని యాక్సెంచర్ ఐటీ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు ఆన్ క్యాంపస్ అవకాశాలు తగ్గిపోవడంతో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆప్ క్యాంపస్ నియామకాలకు పరుగులు పెడుతున్నారు. ఐటీ కంపెనీలకు పరీక్షలు నిర్వహించే ఔట్‌సోర్సింగ్ సంస్థలు దీనిని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ఓ సంస్థ ఈ ఏడాది ఇప్పటివరకూ 8 వేల మందికి పరీక్షలు నిర్వహించి ఫీజు రూపేణ దాదాపు రూ. 91 లక్షలు వసూలు చేసింది. కానీ ఆ సంస్థ ద్వారా పరీక్షలో పాసైన వారిలో 10 నుంచి 12 శాతం మందికే ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేయడం గమనార్హం.
Advertisement
Advertisement