రాష్ట్రంలో నియంత పాలన
రాష్ట్రంలో నియంత పాలన
Published Mon, Jul 25 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
– ప్రజాహక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
– సీమ కేబుల్ కమ్యూనికేషన్ సెంటర్ సీజ్ అన్యాయం
– అఖిలపక్ష సమావేశంలో పీఏసీ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని శాసనసభా ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్, డోన్ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం స్థానిక పాత బస్టాండులోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో అఖిల పక్ష రాజకీయ పార్టీ నేతల సమావేశం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, మాజీ కార్పొరేటర్ తోట వెంకటకష్ణారెడ్డి, కాంగ్రెస్ తరపున జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య, సీపీఎం తరపున కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్, సీపీఐ తరపున జిల్లా నాయకుడు భీమలింగప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా హక్కులను కాలరాస్తూ స్వేచ్ఛ లేకుండా చేస్తుందన్నారు. కర్నూలులో సీమ కేబుల్ కమ్యూనికేషన్స్‌ను సీజ్ చేయడం అన్యాయమని ఖండించారు. జిల్లాలో ఐరన్‌ఓర్ దోపిడీ జరుగుతుందని, టన్నుకు రూ. 250 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కష్ణా పుష్కరాల సందర్భంగా ముందుజాగ్రత్త లేకుండా హడావుడిగా పుష్కర పనులు ప్రారంభించడంలో మతలబు ఏమిటన్నారు. తాను శాసన సభ్యుడి స్థాయిలో 2 పబ్లిక్ లెట్రిన్లు అడిగినా జిల్లా కలెక్టర్ ఇవ్వడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్, లోక్‌సత్తా, సీపీఐ ఎంఎల్ జనశక్తి, జమాతే ఇస్లామీ హింద్ తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యానికి సవాల్: ఎం.ఎ.గఫూర్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
మౌలికమైన ప్రజాస్వామ్యానికి కర్నూలులో సవాల్ ఎదురవుతోంది. జిల్లా కలెక్టర్ పచ్చచొక్కాల మాట విని సీమ డిజిటల్ కమ్యూనికేషన్స్‌ను సీజ్ చేయడం అన్యాయం. లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలకు అందుబాటులో ఉండేలా సీమ డిజిటల్ కేబుల్ కమ్యూనికేషన్స్ పెడితే లైసెన్స్ లేదంటున్నారు. మరి టీడీపీ నాయకుడు శిల్పా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు ప్రాంతాల్లో కేబుల్స్ తీసుకున్నారో లేదో ఒకసారి తనిఖీ చేయాలి.
మిగతా వాళ్లు వ్యాపారం చేయకూడదా: బి.వై.రామయ్య, డీసీసీ అధ్యక్షుడు
కేఈ, ఎస్వీ, టీజీ కుటుంబాలు మాత్రమే వ్యాపారం చేయాలనుకుంటే ఎలా. కేఈ కుటుంబీకులు శ్యాండ్, ల్యాండ్, లిక్కర్, మైనింగ్, కేబుల్ వంటి అన్ని వ్యాపారాల్లో భాగస్వాములై ఉన్నారు. వీరు చేయని ఏదైనా వ్యాపారం ఉంటే అది చెబుతే మిగతా వాళ్లు అదే చేసుకుని బతుకుతారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలాంటి ఉన్నతాధికారులు నాయకుల అడుగులకు మడుగులొత్తాల్సిన అవసరం ఏమొచ్చింది.
దాడుల పరంపర ఈనాటిది కాదు: భీమలింగప్ప, సీపీఐ జిల్లా నాయకుడు
కేఈ కుటుంబం దాడుల పరంపర ఈనాటిది కాదు, తరతరాలుగా కొనసాగుతుంది. రోజూ టీవీల్లో వీరి బొమ్మలు కనబడాలనే వేరే నెట్‌వర్క్‌లు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ కప్పట్రాళ్లను మార్చడం కాదు, ముందు కర్నూలులో దౌర్జన్యాలు అరికట్టాలని సూచించారు.
ఆమోదించిన తీర్మానాలు:
– సీమ కమ్యూనికేషన్స్‌పై అధికారుల పక్షపాత వైఖరిని, అధికార పార్టీకి అనుకూలంగా సాగిస్తున్న దాడులను ఖండించాలి. మీడియా స్వేచ్ఛను హరిస్తున్న అధికారుల చర్యలను నిరసించాలి.
– జిల్లాలో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన జిల్లా అధికారులను బదిలీ చేయాలి, కార్పొరేషన్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి.
Advertisement
Advertisement