బీజేపీ మహబూబ్‌నగర్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ఆ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇక్కడి పండగలను మాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై లోతుగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి పరీక్షరాసి ర్యాంకులు లె చ్చుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చారని దుయ్యబట్టారు.
– సెప్టెంబర్ 17 అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇక్కడి పండగలను మాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై లోతుగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి పరీక్షరాసి ర్యాంకులు లె చ్చుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు ఇబ్బందుల పాలయ్యారని అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17 అంశాన్ని భారతప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు తీర్పు పెండింగ్‌లో ఉండగా యూనివర్సిటీలకు ప్రత్యేక జీఓ ద్వారా వీసీలను నియమించడం చూస్తుంటే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో తెలంగాణకు తలవంపులు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పాల్గొన్నారు.