మహాపచారం | Demolition temples atrocity | Sakshi
Sakshi News home page

మహాపచారం

Published Mon, Jul 4 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

మహాపచారం

మహాపచారం

ఆలయాల కూల్చివేత దారుణం
సర్కారు వైఖరితో రాష్ట్రానికి అరిష్టం
స్వామీజీలు, పూజారులు, భక్తుల మనోగతం

 
 
‘రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల కూల్చివేస్తూ మహాపచారానికి ఒడిగడుతోంది. పాపభీతి, దైవభక్తి అనేవి లేకుండా వ్యవహరిస్తోంది. దేవుళ్లపైనా కక్ష కడుతోంది. కృష్ణా పుష్కరాల వంకతో విజయవాడలో ఈ దుర్మార్గానికి పూనుకుంటోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది’ అని స్వామిజీలు, పూజారులు, అర్చకులు, భక్తులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. మరికొందరు శాపనార్థాలూ పెడుతున్నారు. ఆలయాల కూల్చివేతలో ఆచారాలూ, సంప్రదాయాలూ, శాస్త్ర నియమాలూ పాటించడం లేదు.. హిందువుల మనోభావాలను, సంస్కృతిని, ధర్మాన్నీ దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని, హిందుత్వాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత సామరస్యానికి తూట్లు పొడుస్తున్నారని, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. ఎక్కడో పొరుగు దేశాల్లో సైతం హిందూ ధర్మాన్ని కాపాడుతుంటే ఇక్కడ దేవాలయాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహోదగ్రులవుతున్నారు. దేవుళ్లను నడిరోడ్డుపైన, ఫుట్‌పాత్‌లపైనా పడేస్తున్నారు.. పశువులు, జంతువులకంటే హీనంగా చూస్తున్నారు. ముఖ్యమంత్రి వైఖరి రాష్ట్రానికి అరిష్టమని ఆందోళన చెందుతున్నారు. సర్కారు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని, ఇందుకోసం భక్తులంతా ఐక్యం కావాలని హిందూధర్మ పెద్దలు పిలుపునిస్తున్నారు. సాక్షితో తమ ఆవేదనను పంచుకున్నారు.    - సాక్షి, విశాఖపట్నం
 

రాష్ట్రానికి అరిష్టం
ఆలయాలను కూల్చేయడం వల్ల రాష్ట్రానికి అరిష్టం చుట్టుకుంటుంది. మనం ఉన్నది సంప్రదాయ బద్ధమమైన భారతదేశంలోనూ.. లేక విదేశాల్లోనా అనే అనుమానం కలుగుతుంది. స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాను కూల్చడం అన్నది మహాపాపం. అలాంటి వారిని దేవుడే శిక్షిస్తాడు. ఆలయాలను నమ్ముకున్న అర్చకులు, ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. - కాండూరి వెంకట జగన్నాథాచార్యులు, గాజువాక ఏరియా అర్చక సంఘం ప్రతినిధి
 
ఆలయాలను అభివృద్ధి చేయాలే కానీ..
విజయవాడలో ఆలయాలను కూల్చివేస్తున్నారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మనం హిందూవులమా, లేక మూర్కులమా. భూమి మీద దేవుడు ఉండబట్లే వినాశనాలు జరగకుండా క్షేమంగా బతుకుతున్నాం. దేవుళ్లతో, దేవుని మందిరాలతో ఆడుకుంటే శిక్ష తప్పదు. కోటీశ్వరుల వద్ద డబ్బులు ఉంటే ఆలయాలను అభివృద్ధి చేయాలే తప్పా కూల్చకూడదు. - వెంకటాచార్యులు, బీహెచ్‌పీవీ ప్రసన్న వెంకటేశ్వరాలయం అర్చకులు
 
 
హిందుత్వాన్ని పొడిచి చంపుతున్నారు...

విజయవాడలో ఆలయాలను దుర్మార్గంగా కూల్చివేత చర్య హిందుత్వాన్ని పొడిచి చంపుతున్నట్లుగా ఉంది. బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉంది. బ్రిటిషర్లు దేశాన్ని పాలించినా హిందుత్వాన్ని దెబ్బతీయలేదు. ఇపుడు ఆంధ్రపాలితులే జనంలో తిరగుతూ టైస్టుల్లా వ్యవహరిస్తున్నారు. హిందూధర్మ, సంస్కృతికి తూట్లు పొడుస్తున్నారు.
 విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు. ఇలాంటి చర్యలపై హిందువులాంతా ఏకంకావాలి. - చంద్రమౌళి, శతాధిక ప్రతిష్టాచార్య, బ్రహ్మశ్రీ దొంతుకుర్తి
 
 
రాజధాని నడిబొడ్డున ఘోరం

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హిందూ దేవాలయాలను కూల్చడం ఘోరం. ప్రజల భక్తిభావాలు, సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతీశారు. మతసామరస్యాన్ని రెచ్చగొట్టారు. కనీసం ఆలోచన లేకుండా రాళ్లు రప్పల్లా భగవంతున్నే కూల్చేశారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో...అధికార యంత్రాంగం ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తుందో తెలుస్తోంది.
 - నూతపల్లి అప్పారావు,  శ్రీహరిసేవ వాలంటీర్స్‌వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి
 
హిందూ సంప్రదాయాన్ని కూల్చారు...
విజయవాడలో ఆలయాలను కూల్చివేయడం దారుణం. హిందూ సంప్రదాయాన్ని నిలువునా కూల్చారు. మనోభావాల్ని దెబ్బతీశారు. ఇది అత్యంత బాధాకరం. అభివృద్ధి పేరుతో భక్తుల ఆత్మాభిమానాలు దెబ్బతీస్తే ఎవరు సహిస్తారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరం. దీన్ని హిందువులంతా ఖండించాలి.   - శేఖర్‌శర్మ, శారదా పీఠపాలిత ఉమామహేశ్వరాలయ ప్రధానార్చకుడు
 
ఆలయాల కూల్చివేతను ఖండిస్తున్నా
విజయవాడలో ఆలయాల కూల్చి వే త చర్యను ఖండిస్తున్నా. ఆగమ శాస్త్రం ప్రకారం పండితులు సూచన మేరకు స్థలం కేటాయించి ఆలయాలను అక్కడకు తరలించాలి. ముందస్తు చర్యలు లేకుండా దేవాలయాలు పడగొట్టడం దారుణం. ఆలయాల్లో దూపదీప నైవేద్యాలు చేస్తు చాలా మంది పురోహితులు బతుకుతున్నారు. వాళ్లందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  
 -దగ్గుపల్లి సాయి, మాజీ చైర్మన్, పాండురంగస్వామి దేవస్థానం, పాయకరావుపేట
 


మనోభావాలు దెబ్బతీయడమే
నోటీసులు కూడా ఇవ్వకుండా ఆలయాలను కూల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఇది పరాకాష్ట. దేవుని విగ్రహాలు తొలగించి ఎక్కడికక్కడ పడేశారు. చాలా బాధపడ్డా.
 -అంబటి సీతారాం, దుర్గాలమ్మచెట్టు దేవస్థానం మాజీ చైర్మన్, పాయకరావుపేట
 
ఇది మంచి పద్ధతి కాదు
ఆలయాల తొలగింపు అన్యాయం. దేవాలయాలను తొలగించే ముందు ఆగమశాస్త్ర ప్రకారం చర్యలు చేపట్టాలి. దేవతామూర్తుల విగ్రహాలను పొక్లెయిన్లతో కూల్చి వేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు.     -వామాల శ్రీను, సీతారామస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, పాయకరావుపేట
 
 హైందవ ధర్మానికి అపచారం
 ఆలయాలు కూల్చివేసి హైందవ ధర్మానికి ప్రభుత్వం అపచారం చేసింది. మరొక చోట దేవాలయాలు నిర్మించి ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహాలను అక్కడికి తరలించాల్సి ఉంది. కానీ విగ్రహాలను కూల్చి పక్కన పడేసింది. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. దేవుడు, దేవాలయాలకు విలువ లేకుండా చేశారు.    -ధనిశెట్టి బాబూరావు, పాండురంగస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, పాయకరావుపేట
 
 
దేవుడిని హత్య చేసినట్లే..
కృష్ణానది ఒడ్డున ఆలయాలు కూల్చడం దేవుడిని హత్య చేసినట్లే అవుతుంది. ఏన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలను తొలగించడం ఆగమశాస్త్రాన్ని వ్యతిరేకించడమే. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన కలిగించాల్సిన ప్రభుత్వమే ఈ దుష్టచర్యకు పాల్పడటాన్ని పీఠాధిపతులు, భక్తులు ఖండించాలి. ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల వల్ల ప్రజలకు అరిష్టం కలుగుతుంది.   -స్వామి పరానంద భారతి, సుందరనగరం
 జ్ఞానానంద చారిటబుల్ ట్రస్ట్ పీఠాధిపతి
 
 
ఆధ్యాత్మిక భావన దెబ్బతీయడమే..

దేవాలయాలను కూల్చడం మంచి పద్ధతి కాదు. దీనివల్ల మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక భావనను దెబ్బతీయడమే అవుతుంది. ప్రభుత్వమే ఇలాంటి పనికి పూనుకోవడం ఆశ్చర్యకరం. మతాలతో సంబంధం లేకుండా ఇలాంటి చర్యలను ఖండించాలి. హిందూ ధర్మ పరిరక్షణకు పూనుకోవాలి. -స్వామీజీ సౌమాన్యంద అవదూత,  ఆనంద్‌మార్గ్ ఆశ్రమం, డెయిరీఫారం
 
అందరితో మాట్లాడాలి..

ఆలయాలను తొలగించాల్సి వస్తే ప్రజలు, భక్తులు, పీఠాధిపతులతో మాట్లాడాలి. అందరికి ఆమోదమైన చోటు కేటాయించాలి. అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ట జరిగిన తరువాత పాత ఆలయాన్ని కూల్చాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం దారుణం. ఇటువంటి చర్యలకు పాల్పడ్డం ఏమాత్రం మంచిదికాదు
 -రామాయణం సబ్రహ్మణ్య శర్మ, అర్చకుడు, భీమిలి
 

అధికారమదంతో రెచ్చిపోతున్నారు

రాష్ట్ర ప్రభుత్వం అధికారమదంతో రెచ్చిపోతోంది. ఆలయాలను, విగ్రహాలను కూల్చేసి రోడ్లపై దిక్కులేకుండా పడేయడం దారుణం. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. ఎవర్ని సంతృప్తి పర్చడం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో.. అర్థం కావడంలేదు. ఎండోమెంట్ విభాగం నిద్రపోతోందా అనే అనుమానం కలుగుతోంది. ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకమైన మన భారతదేశ గౌరవం మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు.   -వెలవెలపల్లి నాగబాబు శర్మ సాయిబాబా ఆలయ ప్రధానార్చకులు, గాజువాక
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement