డిపాజిట్ సొమ్ము చోరీ
Published Wed, Nov 30 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
భీమడోలు : బ్యాంకులో నగదు డిపాజిట్ వేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వద్ద రూ.21వేలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన మంగళవారం పూళ్ల ఆంధ్రాబ్యాంకులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పూళ్ల గ్రామానికి చెందిన కూటికుప్పల వాసు, అతని భార్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందారు. వాసు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో దాతలు ఇచ్చిన ఆర్థిక సాయంతో కుటుంబ సభ్యులకు చెందిన రూ.21వేల పెద్ద నోట్లను ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వాసు నిదానంగా నడుస్తూ వచ్చాడు. డిపాజిట్ పత్రం పూరించే తరుణంలో బ్యాంకు సిబ్బందికి నోట్లను చూపించాడు. కొద్దిసేపు సమయం పడుతుందని వారు బదులివ్వడంతో ఆ సొమ్మును జేబులో పెట్టుకున్నాడు. ఇంతలో అక్కడే ఉన్న 15 ఏళ్లలోపు బాలుడు బాధితుడు వాసు జేబులోని నగదును గుట్టుచప్పుడుకాకుండా చోరీ చేశాడు. ఆ తర్వాత కౌంటర్‌లో డిపాజిట్ పత్రం అందించే తరుణంలో జేబులో నగుదు చూసుకున్న వాసు అవి కనిపించకపోవడంతో భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ వెంకటేశ్వరరావు బ్యాంకుకు చేరుకుని బాధితడి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేనేజర్ ఎస్.ఎస్.చలపతిరావు సహకరించడంతో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement