విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిలకడగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని పేర్కొంది.
24 గంటల్లో ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.