పుష్కరాల నాటికి దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.50 కోట్ల కేటాయింపు
ఈ నిధులు అమ్మవారి ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి తీసుకోవాలంటున్న ప్రభుత్వం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
పుష్కరాల నాటికి దుర్గమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ.50 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. ఇది విన్న వారంతా అమ్మవారి ఆలయంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అనుకున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి అమ్మవారి ఖాతాలో నిధులే ఉపయోగించుకోవాలంటూ సెలవిచ్చింది. దీంతో భక్త జనం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వమే ప్రత్యేకంగా నిధులివ్వాలని డిమాండ్ చేస్తోంది.
విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అభివృద్ధి పేరుతో అమ్మవారి డిపాజిట్లను మంచినీళ్లులాగా ఖర్చు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పుష్కరాల నాటికి రూ.50 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ పనులకు దేవస్థానం ఫిక్స్‌డ్ డి పాజిట్లను ఉపయోగించుకుంటామని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం అమ్మవారికి ప్రధాన ఖాతాలో రూ.130 కోట్లు, అన్నదానం ఖాతాలో రూ.35 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ నిధులను మాత్రం అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా వినియోగిస్తే సహించేది లేదని భక్తులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా?
తెలంగాణలో యాదాద్రి వంటి ముఖ్య దేవాలయాల అభివృద్ధిని అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉగాది పండుగ, రాజధాని శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు దుర ్గగుడి నిధుల్ని వినియోగిస్తోంది. రాజధాని ప్రాంతంలో ఉన్న దేవాలయానికి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే.. అమ్మవారి డిపాజిట్లు తీయాల్సిన అవసరం ఉండబోదని ధార్మిక సంఘాలు చెబుతున్నాయి.
భక్తుల నుంచి విరాళాలు...?
అమ్మవారి ఆలయ అభివృద్ధికి విరాళాలిచ్చేందుకు భక్తులు ముందుంటారు. గతంలో రాజగోపురంపై స్వర్ణ కలశాల ఏర్పాటుకు రూ.90 లక్షలు భక్తులే అందించారు. స్వర్ణ శిఖరం నిర్మాణానికి సహకరించారు. ఇప్పుడు కనకదుర్గా నగర్‌లో భవన నిర్మాణం, కోనేరు నిర్మాణం, ఇంద్రకీలాద్రి రక్షణ గోడపై నిర్మించే చిత్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరించవచ్చు. అవసరమైతే దాతల పేరు ఆయా ప్రదేశాల్లో రాయవచ్చు. అందుకు భిన్నంగా అమ్మవారి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఖర్చు చేయడమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఇతర దేవాలయాలతో పోల్చితే..
ద్వారకా తిరుమల, సింహాచలం వంటి దేవాలయాలకు ఆదాయం వచ్చినప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేయకుండా భూములు కోనుగోలు చే శారు. దీంతో ఆయా దేవాలయాలకు వందల ఎకరాల భూములు ఉన్నాయి. గతంలో దుర్గ గుడి ఈవోలు పని చేసిన వారు వచ్చిన ఆదాయాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేశారు. దీంతో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ప్రైవేటు భూముల్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలా కాకుంటే ఆస్తులు ఉన్న చిన్న దేవాలయాలు, సత్రాలను దత్తత తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దేవస్థానం ఖర్చుల భారం పెరుగుతోంది. గతంలో అమ్మ వారి సొమ్ముతో విజయవాడ ప్రభుత్వాసుపత్రినిఅభివృద్ధి చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని భక్తులు న్యాయస్థానంలో అడ్డుకుని అమ్మ వారి డిపాజిట్లు కాపాడారు. అమ్మవారి డి పాజిట్లు జోలికి వెళ్లినందుకు గతంలో ఈవోలు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
మంత్రి ఉమా స్పందన ఏమిటి...?
గతంలో దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గిరిప్రదక్షిణ, ఆందోళనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై అధికారుల్ని నిలదీశారు. ఇప్పుడు ఏకంగా అమ్మవారి ఫిక్స్‌డ్ డిపాజిట్లకే అధికారులు ఎసరు పెడుతుంటే ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...!
అభివృద్ధికి అమ్మ నిధులే..!
Published Sun, May 1 2016 9:26 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM
Advertisement
Advertisement