
అభివృద్ధి దిశగా పాలకొండ్రాయుడి దేవస్థానం
కడప నగర శివార్లలోని పాలకొండలలో ఉన్న పాలకొండ్రాయస్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిన ఈ ఆలయంలో గతంలో సంవత్సరానికి శ్రావణమాసంలో నాలుగు వారాలు మాత్రమే పూజలు నిర్వహించేవారు.
కడప వైఎస్సార్ సర్కిల్ :
కడప నగర శివార్లలోని పాలకొండలలో ఉన్న పాలకొండ్రాయస్వామి దేవస్థానం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరిన ఈ ఆలయంలో గతంలో సంవత్సరానికి శ్రావణమాసంలో నాలుగు వారాలు మాత్రమే పూజలు నిర్వహించేవారు. మిగతా రోజుల్లో దూప, దీప నైవేద్యాలు స్వామికి కరువే. అయితే వైఎస్‌ఆర్ హయాంలో పాలకొండల సమీపంలో రిమ్స్‌తోపాటు పలు విద్యా సంస్థలు ఏర్పాటు కావడంతో ఆలయ దశ మారింది. దీంతో పుట్లంపల్లె గ్రామ ప్రజలు, నగరంలోని మరికొందరు కమిటీగా ఏర్పడి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు.
–పాలకొండ్రాయస్వామి ఆలయానికి మొత్తంగా మరమ్మతులు నిర్వహించి చుట్టూ గ్రానైట్ ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణలో చుట్టూ కాంపౌండ్ గోడ నిర్మించి వాటిపై విష్ణుమూర్తి అవతారాలున్న విగ్రహాలను ప్రతిష్ఠించారు. లక్ష్మిదేవి అమ్మవారి ఆలయాన్ని, సమీపంలోని అచ్చమ్మ ఆలయాలకు మరమ్మతులు చేపట్టారు. గతంలో అచ్చమ్మ దేవస్థానం కూలిపోయి చెట్టు కింద మాత్రమే విగ్రహం ఉండేది. అక్కడ దాతలు సహకరించడంతో ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారిని కొలువుదీర్చారు.
వసతి గృహాలకు మరమ్మతులు..
పాలకొండకు వచ్చే భక్తులకు ఆలయ సమీపంలో శిథిలావస్థకు చేరిన వసతి గృహాలకు మరమ్మతులు నిర్వహించి రూపుదిద్దారు. వంట చేసుకోవడానికి వంటశాలను, తలనీలాలు, కల్యాణకట్టను, మరుగుదొడ్లను, కల్యాణ వేదికను, భక్తులు కూర్చోవడానికి అవసరమైన అరుగులను ఏర్పాటు చేశారు.
నిత్య పూజలకు ఆలయ కమిటీ కృషి..
ప్రతిరోజు స్వామి వారికి పాలాభిషేకం, దూప దీప నైవేద్యం వంటి పూజలు నిత్యం జరగడానికి విశేషమైన కృషి చేస్తున్నారు. అక్కడే ఇద్దరు పూజారులను నియమించి పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం ఆలయానికి వచ్చే భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతిని, భక్తుల రాత్రి సమయంలో బస చేయడానికి గదులను నిర్మించారు. దేవాదాయశాఖ
నుంచి వచ్చే నిధులు, ఆలయ పాలక మండలి సేకరించిన దాతల చందాలతో ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. పాలకొండల దిగువభాగం నుంచి ట్రాక్టర్ ఇసుక తరలించడానికి (గాడిదల సహాయంతో) రూ. 15 వేలు ఖర్చవుతోంది. అలాగే సిమెంటు దిమ్మెలు, సిమెంటు బస్తాలు, గ్రానైట్ వంటి వాటిని తీసుకు వెళ్లడానికి అధిక ఖర్చు వస్తోందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి..
పాలకొండ్రాయస్వామి దేవస్థాన అభివృద్ధికి చైర్మన్‌గా నా వంతు కృషి చేస్తున్నాను. కొండ దిగువభాగాన శంఖుచక్ర నామాలున్న గాలి గోపురాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దాతలు బాగా సహకరిస్తున్నారు. – బాల ఓబుల్‌రెడ్డి,చైర్మన్, పాలకొండ్రాయస్వామి దేవస్థానం