బుట్టాయిగూడెం అడవుల్లో డైనోసార్ శిలాజాలు
♦ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వృక్ష శిలాజాలు
♦ చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి వెల్లడి
ఏటూరునాగారం: వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని బుట్టాయిగూడెం అటవీ ప్రాంతంలోని లక్షల సంవత్సరాల కిందటి వృక్ష శిలాజాలు, డైనోసార్ శిలాజాలు ఉన్నట్లు ఆనవాళ్లు లభించాయి. ఆది మానవుల కాలం నాటి చరిత్రను మూడేళ్లుగా వెలుగులోకి తెస్తున్న అధ్యాపకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో ఇవి బయటపడ్డాయి. బుట్టాయిగూడెంలోని చెలకల్లో అడుగడుగునా శిలాజాలున్నాయి. రెండు మీటర్ల పొడువైన వృక్ష శిలాజంతోపాటు అనేక ప్రాంతాల్లో డైనోసార్ ఎముకలు కనిపిస్తున్నాయి. స్థానికులు వీటిని రాకాసి బొక్కలు అని పిలుస్తుంటారు.
ఈ గ్రామంలో ప్రాచీన శిలా యుగానికి చెందిన అనేక రాతి పనిముట్లును రత్నాకర్ సేకరించారు. ఒక సూక్ష్మరాతి పనిముట్టు కూడా లభించిందని వెల్లడించారు. బుట్టాయిగూడెం నుంచి అడవుల్లోకి వెళ్లినట్లైతే మరిన్నీ పొడవైన శిలాజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. అడవిలో పరిశోధనలు జరిపితే డైనోసార్‌ల శిలాజాలు వెలుగులోకి వస్తాయని రత్నకర్ తెలిపారు. జంతు శిలాజపు మూడు అంగుళాల ఎముక దొరికిందన్నారు. పరిశోధనలో పకిడె అరవింద్, స్థానికులు గోగు కల్యాణ్, రేసు మణికంఠ పాల్గొన్నారు.