విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై చట్టసభల్లో చర్చ
విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై చట్టసభల్లో చర్చ
Published Sat, Dec 3 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
– ఒకరోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో సూచనలు తీసుకుంటాం
– శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్
కర్నూలు(అర్బన్): విభిన్న ప్రతిభావంతుల సామాజిక, ఆర్థిక పరిపుష్టికి సంబంధించి ప్రత్యేక అజెండాను రూపొందించి శాసనసభ, శాసనమండలిలో ఒక రోజు సంపూర్ణ చర్చ జరిగేందుకు కృషి చేస్తామని శాసనమండలి చైర్మన్ డా.ఏ చక్రపాణియాదవ్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సూచనలు, సలహాలు స్వీకరించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రయోజన పూర్వకమైన ఉత్తర్వులను తీసుకువస్తామన్నారు. శనివారం ప్రపంచ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేడ్కర్‌భవన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రపాణియాదవ్ మాట్లాడుతూ వికలాంగుల్లో ఎనలేని శక్తి సామర్థ్యాలు దాగి ఉంటాయని, వాటిని వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు వారికి అండగా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో 55 వేల మందికి వికలాంగ పింఛన్లు ఇస్తున్నామని, ఏ కుటుంబంలోనైనా 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉంటే ఆయా కుటుంబాలకు అంత్యోదయ కార్డులు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇందుకు సంబంధించి గుర్తింపు ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఈ నెలలో జరగనున్న సదరం క్యాంపులో దివ్యాంగులు దరఖాస్తులు అందించి తగిన సర్టిఫికెట్లు పొంది పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కర్నూలులో సెన్సరీ పార్కు ఏర్పాటుకు రూ. 5 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. అనంతరం వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వివాహ ప్రోత్సాహకాలు అందించారు. కార్యక్రమంలో జేసీ–2 ఎస్ రామస్వామి, ఉపాధ్యాయులు పుష్పరాజ్, ఉద్యోగ సంఘాల ప్రతినిధి కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు.
Advertisement
Advertisement