ఉద్యాన వర్సిటీ కొత్త వీసీపై చర్చ | discussion on new vc | Sakshi
Sakshi News home page

ఉద్యాన వర్సిటీ కొత్త వీసీపై చర్చ

Published Sun, Oct 9 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

discussion on new vc

తాడేపల్లిగూడెం : డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీ కొత్త ఉపకులపతి నియామకంపై వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఉపకులపతి బాధ్యతలు స్వీకరించి త్వరలో మూడేళ్లు కావస్తోంది. వీసీ పదవీకాలం నిబంధనల ప్రకారం మూడు సంవత్సరాలు. ఈ గడువు ముగిశాక కూడా వీసీని ప్రభుత్వం కొనసాగించవచ్చు. కొత్త వీసీ వచ్చేవరకు అన్నట్టుగా ఫర్‌దర్‌ అన్టిల్‌ ఆర్డర్‌ అనే ఆదేశాలను ఇచ్చే అవకాశాలూ ఉంటాయి. 2007లో వెంకట్రామన్నగూడెంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత తొలి ఉపకులపతిగా ఎస్‌డీ.శిఖామణి, రిజిస్ట్రార్‌గా డాక్టర్‌ పి.సూర్యనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరి ఉద్యోగ కాలం ముగిసిన తర్వాత కొంతకాలం పాటు ప్రిన్సిపాల్‌ సెక్రటరీ టు గవర్నమెంట్‌గా ఉన్న ఐఏఎస్‌ అధికారి శర్మ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. రిజిస్ట్రార్‌ సూర్యనారాయణరెడ్డి తర్వాత ఇప్పటివరకు ఈ సీటు ఇన్‌చార్జిల ఏలుబడిలో ఉంది. డాక్టర్‌ బి.శ్రీనివాసులు ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఐఏఎస్‌ అధికారి శర్మ తర్వాత  2013 డిసెంబర్‌లో వర్సిటీ రెండో ఉపకులపతిగా ఐసీఏఆర్‌లో దీర్ఘకాలం పనిచేసిన డాక్టర్‌ బీఎంసీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌లో ముగియనుంది. ఆయననే మరికొంతకాలం కొనసాగిస్తారా లేదంటే ఆయన ఉద్యోగకాలం ఇక్కడ ముగిసిన తర్వాత కొత్తవారిని వీసీగా నియమిస్తారా అనే విషయంపై వర్సిటీ స్నాతకోత్సవం తర్వాత చర్చ ప్రారంభమైంది. వివాదరహితుడిగా పేరొందిన బీఎంసీ రెడ్డిని మరికొంతకాలం వీసీగా కొనసాగించాలని స్నాతకోత్సవం తర్వాత వర్సిటీ వర్గాలు కోరినట్టు సమాచారం. వీసీ రేసులో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గతంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆలపాటి సత్యనారాయణ పేరు వినిపిస్తోంది. గతంలో వీసీ నియామక ప్రక్రియ సమయంలో కూడా ఆలపాటి తెరమీదకు వచ్చారు. ఆయనకు సీనియారిటీతో పాటు, గతంలో కాంగ్రెస్‌ ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసి తర్వాత బీజేపీలో చేరిన నేతకు బంధుత్వం ఉందని సమాచారం. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement