ఏసీబీకి చిక్కిన జిల్లా రిజిస్ట్రార్
భూమి రిజిస్ర్టేషన్‌కు రూ.40 వేలు డిమాండ్
బ్రోకర్ ద్వారా అందజేస్తుండగా పట్టుకున్న అధికారులు
కాకినాడ క్రైం: ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం మధ్యవర్తి ద్వారా రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి జిల్లా రిజిస్ట్రార్ ఎం.బాలప్రకాశ్‌ను పట్టుకున్నారు. కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన గుండా శ్రీరామచంద్రమూర్తికి సూర్యారావుపేట అశోక్‌నగర్ సమీపంలో 191/4,195/5, 190/1 సర్వే నంబర్లలో ఉన్న 1.10 ఎకరం భూమిని అభివృద్ధి చేసేందుకు ఆయన కుమారుడు గుండా ప్రసాద్ (కిషోర్) డెవలెపర్స్‌కి విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం 2016 డిసెంబర్ 30న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమి ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, జిల్లా రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సూచించారు.
ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాశ్‌ను సంప్రదించగా ఆయన కూడా అదే విషయం స్పష్టం చేశారు. దీంతో 1964 సంవత్సరం నుంచి ఉన్న సదరు భూ రికార్డులను రెవెన్యూ అధికారులకు చూపగా వారు వాటిని పరిశీలించి ఈ భూమి అసైన్డు భూమి కాదని, యాజమాని గుండా శ్రీరామచంద్రమూర్తికి చెందినదేనని నిర్థారిస్తూ ఆర్డీవో ఎన్‌వోసీ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ తీసుకెళ్లి రిజిస్ట్రార్‌కు అందించినా రిజిస్ట్రేషన్‌కు ససేమిరా అనడంతో రియల్ ఎస్టేట్ మధ్యవర్తి, రిజిస్ట్రేషన్‌శాఖకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న ఎం.సురేష్‌ను గుండా ప్రసాద్ సంప్రదించగా, రిజిస్ట్రేషన్ చేయిస్తానని, ఇందుకు రిజిస్ట్రార్‌కి రూ.50 వేలు లంచం ఇవ్వాలని మ«ధ్యవర్తి కోరాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని రూ. 40 వేలు ఇస్తానని చెప్పడంతో ఇందుకు మధ్యవర్తి అంగీకరించాడు. అదే సమయంలో ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు బుధవారం రూ.40 వేలను కాకినాడ జెడ్పీ సెంటర్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సురేష్‌కు అందించాడు.
నగదు కవర్‌ను తీసుకువెళ్లి రిజిస్ట్రార్ బాలప్రకాశ్‌కు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు ఆయనను రెడ్‌హేండెడ్‌గా పట్టుకుని 20 రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రతాప్‌నగర్‌లో రిజిస్ట్రార్ ఇంటిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిందితుడ్ని గురువారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు మోహన్, పశ్చిమగోదావరి జిల్లా సీఐ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. బాలప్రకాశ్ ఇక్కడకు రాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌శాఖలో డీఐజీగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత డీఐజీ పోస్టు అందుబాటులో లేకపోవడంతో జిల్లా రిజిస్ట్రార్‌గా కాకినాడ వచ్చాడు. ఈయన పదవీ విరమణ చేసేందుకు మరో ఏడాది ఉండడం గమనార్హం.