'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు | doctor chandrabhushan licence cancelled in nikhil reddy case | Sakshi
Sakshi News home page

'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు

Published Sat, Nov 5 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు

'హైట్' డాక్టర్‌పై రెండేళ్ల వేటు

నిఖిల్‌కు శస్త్ర చికిత్స చేసిన చంద్రభూషణ్‌పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్య
తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండా శస్త్రచికిత్స చేసిన చంద్రభూషణ్
డబ్బు కోసమే ఇలా చేసినట్లు ఆరోపణ.. ఇప్పటికీ నడవలేకపోతున్న నిఖిల్‌రెడ్డి
మరికొందరు వైద్యులపైనా చర్యలు తీసుకున్న మెడికల్ కౌన్సిల్
సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై ఐదేళ్ల సస్పెన్షన్

 
సాక్షి, హైదరాబాద్: ఎత్తు పెంచాలంటూ తమ దగ్గరికి వచ్చిన నిఖిల్‌రెడ్డి అనే యువకుడికి.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, వైద్య ప్రమాణాలకు విరుద్ధంగా శస్త్రచికిత్స చేసిన గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్‌పై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన రెండేళ్లపాటు ఎటువంటి వైద్యం చేయకుండా నిషేధం విధించింది. ఆయనతోపాటు వైద్యవృత్తికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించిన మరికొందరు వైద్యులపైనా మెడికల్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. సరోగసీ విధానంలో అక్రమానికి పాల్పడిన సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రతపై ఐదేళ్ల పాటు సస్పెన్షన్ విధించింది.

తప్పుడు విధానాలు అవలంబించిన సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్ రాహుల్ కార్టర్, మలక్‌పేట్‌కు చెందిన డాక్టర్ హరికుమార్ రవ్వా, డాక్టర్ మినాజ్ జఫర్‌లపైనా చర్యలు తీసుకుంది. శుక్రవారం మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీంద్రారెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ కఠిన చర్యలు తీసుకుంది. ఈ సమావేశానికి వైద్య విద్య డెరైక్టర్ రమణి, కాళోజీ వర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

నరకం చవిచూసిన నిఖిల్
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన వ్యాపారి గోవర్ధన్‌రెడ్డి రెండో కుమారుడు నిఖిల్‌రెడ్డి (22) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తాను 5.7 అడుగుల ఎత్తున్నా కూడా మరింత పొడవు పెరగాలన్న కోరికతో.. గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేస్తే ఎత్తు పెరగొచ్చని ఆర్థోపెడిక్ సర్జన్ చంద్రభూషణ్ చెప్పడంతో.. శస్త్రచికిత్సకు సిద్ధపడ్డాడు. దీంతో నిఖిల్ తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చంద్రభూషణ్ నేతృత్వంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే అప్పటికే ఇంట్లో చెప్పకుండా వెళ్లిన కుమారుడి పట్ల ఆందోళనకు గురైన నిఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకి గ్లోబల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

నిఖిల్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళన కూడా చేశారు. వైద్యుల తీరుపై అంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండుకాళ్లకు శస్త్రచికిత్స చేయడంతో నెలల కొద్దీ నిఖిల్ మంచానికే పరిమితమయ్యాడు. ఇప్పటికీ మరొకరి సాయం లేకుండా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఘటనపై నిఖిల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మెడికల్ కౌన్సిల్ విచారణ జరిపింది. చంద్రభూషణ్ నీతిబాహ్యమైన పద్ధతిలో వైద్యం చేసినట్లు  గుర్తించి, రెండేళ్లపాటు వైద్య వృత్తి నుంచి బహిష్కరించింది. నిఖిల్‌రెడ్డి ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య నిపుణులను అతని వద్దకు పంపాలని నిర్ణయించింది.
 
వైద్యురాలిపై ఐదేళ్ల సస్పెన్షన్
కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ ఏర్పాటు చేసిన డాక్టర్ నమ్రత మరో రకమైన తప్పుడు పనికి పాల్పడినట్లు మెడికల్ కౌన్సిల్ గుర్తించింది. అమెరికాలో ఉంటున్న సుంకరి మన్మథకుమార్, చందన దంపతులు సంతానం కోసం నమ్రతను ఆశ్రయించారు. అద్దె గర్భం ద్వారా వారికి సంతానభాగ్యం కలిగించనున్నట్లు చెప్పిన నమ్రత... విశాఖపట్నం నుంచి ఒక సరోగసీ మదర్‌ను హైదరాబాద్‌కు రప్పించారు. అయితే చందన నుంచి సేకరించిన అండానికి ఆమె భర్త వీర్య కణాలు కాకుండా... వేరే వ్యక్తికి చెందిన వీర్య కణాలతో ఫలదీకరణం చెందించి సరోగసీ మహిళ గర్భంలోకి పంపించారు. పాప పుట్టిన తరువాత అమెరికాకు తీసుకెళ్లే క్రమంలో పాస్‌పోర్టు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో ఆ దంపతులు మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ నమ్రత ఐదేళ్లపాటు ఎలాంటి వైద్యం చేయకుండా సస్పెన్షన్ వేటు వేసింది.
 
ముగ్గురిపై 6 నెలలు వేటు
సెరెనిటీ ఫౌండేషన్ డాక్టర్ రాహుల్ కార్టర్, మలక్‌పేట్‌లోని మైండ్‌క్రెస్ట్ ఆస్పత్రి వైద్యుడు హరికుమార్ రవ్వా, సమతా రిహాబిలిటేషన్ సెంటర్‌కు చెందిన డాక్టర్ మినాజ్ జాఫర్‌లు మానసిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఆ రంగంతో సంబంధం లేని నాన్ మెడికల్ సిబ్బంది ద్వారా మానసిక చికిత్సలు చేరుుంచినట్లు గుర్తించారు. దీనికి సంబందించి ఈ ముగ్గురిని ఆరు నెలల పాటు వైద్య వృత్తి నుంచి సస్పెండ్ చేశారు.

అవసరం లేకున్నా ఆపరేషన్లు
జగిత్యాల సమీపంలోని ఓ గ్రామానికి చెందినవారు కడుపు నొప్పితో బాధపడుతూ డాక్టర్ టి.మనోజ్‌కుమార్‌ను ఆశ్రరుుంచారు. ఆయన వారితోపాటు సమీపంలోని మరో గ్రామానికి చెందిన కొందరికి అవసరం లేకపోరుునా అపెండిసైటిస్ ఆపరేషన్లు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ నిర్ధారించింది. దీనికి సంబంధించి డాక్టర్ మనోజ్‌తో పాటు మరో ఏడుగురిపై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. ఇక ఎంబీబీఎస్ చదివి ఎండీగా సైన్ బోర్డు ఏర్పాటు చేసుకొన్న డాక్టర్ కృష్ణకాంత్‌రెడ్డిపై, ఆర్‌ఎంపీలుగా చలామణీ అవుతున్న కె.స్వామి, డి.రాజేశ్‌లపైనా చర్యలు తీసుకుంది.

సీరియస్‌గా విచారణ
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గత ఏప్రిల్ నుంచి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. దీనిపై 100 మందికి పైగా విచారించింది. నిఖిల్‌రెడ్డి తల్లిదండ్రుల ఆవేదనను విన్నది. అనేక డాక్యుమెంట్లు సేకరించి, వైద్య వృత్తి నిబంధనలను అధ్యయనం చేసింది. ఆయా రంగాల్లో నిపుణులైన ఇతర వైద్యులనూ సంప్రదించింది. మన దేశంలో వ్యక్తుల సగటు ఎత్తు 5.5 అడుగులు. మరి నిఖిల్‌రెడ్డి 5.7 అడుగుల ఎత్తున్నాడు. అయినా ఆపరేషన్ ఎందుకు చేశారు, ఆరడుగులున్న వ్యక్తి వచ్చి మరో 4 అంగుళాలు పెంచమంటే పెంచుతారా అన్న వాదనలను కౌన్సిల్ పరిగణనలోకి తీసుకుంది. ఆపరేషన్ చేశాక నిఖిల్ నెలల కొద్దీ మంచంలోనే ఉండాల్సి వ స్తే ఎవరు బాగోగులు చూస్తారని కూడా ఆలోచించకపోవడాన్ని తప్పుబట్టింది. మొత్తంగా వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన డాక్టర్ల పట్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైద్య వృత్తి పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పరచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని వైద్య విద్యా డెరైక్టర్ రమణి వ్యాఖ్యానించారు.

ఇప్పటికీ కుమిలిపోతున్నా..: నిఖిల్‌రెడ్డి
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం పట్ల బాధితుడు నిఖిల్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనలా ఎవరూ మోసపోకుండా ఉండడానికి ఇది తోడ్పడుతుందన్నారు. వైద్యులపై చర్యలు తీసుకుంటూ కౌన్సిల్ ప్రకటన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను నమ్మించి మోసం చేశారు. ఇప్పటికీ సరిగ్గా నడవలేకపోతున్నాను. ఆ రోజు డాక్టర్లు చెప్పింది ఒకటైతే ఇప్పుడు జరుగుతున్నది మరొకటి.

ఆపరేషన్ తర్వాత మూడు నెలల్లో యధావిధిగా నడుస్తావని డాక్టర్లు చెప్పినందుకే తల్లిదండ్రులకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. డబ్బుల కోసమే ఇలా జరిగిందని ఊహించలేకపోయాను. ఇన్ని రోజులు కుమిలిపోతున్నా..’’ అని నిఖిల్‌రెడ్డి చెప్పారు. వైద్యులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా పోరాడి.. వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement