అభివృద్ధిని అడ్డుకుంటే ఎవరినీ వదిలిపెట్టను
పగిడ్యాల: ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఎవ్వరిని వదిలి పెట్టమని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. ఆదివారం మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో మోడల్ పాఠశాల నిర్మాణం పూర్తి చేసిందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనుల్లో కూడా పలు అడ్డంకులు వచ్చాయని అయినా పనులను ఆగష్టులోగా పూర్తి చేసి, రెండో పంటకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో నడిపించి అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలన్నారు. స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం లేదని స్వాములు అనే వ్యక్తి కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. స్పందించిన ఆయన విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్డీవో రఘుబాబుకు ఆదేశించారు. కార్యక్రమంలో పీడీ రామకృష్ణ, డీఈవో రవీంద్రానాథ్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ కుమారస్వామి, ఎంఈవో రంగారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.