హాఫ్ ఫొటో చూసి నిందలు వేస్తారా?
తన తల్లిపై అనవసరంగా నిందలు వేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కుమార్తె తేజశ్విని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. తన తల్లిపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తేజుశ్విని స్పందించారు. కుటుంబ సభ్యులతో కలిసి రెస్టరెంట్ కు వెళ్లిన రేణుక ఫొటోపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. పనమ్మాయిని పక్కనే నిలబెట్టి వారంతా భోజనం చేస్తున్నట్టు ఆ ఫొటోలో ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పనమ్మాయిని మనిషిగా చూడకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకోకుండా నిందలు వేయడం సరికాదని తేజుశ్విని అన్నారు. 'పనమ్మాయిని నాకోసమే నియమించింది. ఆమె బాలిక కాదు. ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు 9, 7 ఏళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. రెస్టరెంట్ లో మాతోపాటే భోజనం చేసింది. మా అమ్మ అందరినీ సమానంగా చూస్తుంది. తన చుట్టు ఉన్నవారి అవసరాలను స్వయంగా తెలుసుకుని తీరుస్తుంది. ఎంతో మంది మహిళలు, పిల్లలను ఆమె కాపాడింది. ధైర్యం, విశ్వాసం, దయగుణం కలిగిన అమ్మ ఇప్పటికీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిస్తోంది. అలాంటి ఆమె అకారణంగా నిందలు మోపుతున్నారు.
ఆమె సహాయం పొందిన వారిలో చాలా మందికి ట్విటర్ ఖాతాలు లేవు. అందుకే సోషల్ మీడియాలో విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. సరైన ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సమంజసం కాదు. హాఫ్ ఫొటో చూసి విమర్శలు గుప్పించడం కరెక్ట్ కాదు. అసలేం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధ పెట్టే కామెంట్స్ చేయొద్ద'ని తేజుశ్విని పేర్కొన్నారు.