నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం..
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం..
Published Sun, Jul 17 2016 11:59 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
నల్లగొండ :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. హరితహారం, ఉపాధి హామీ పథకం పనులపై నల్లగొండలోని ఉదియాదిత్య భవన్‌లో ఆదివారం ఆయన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. మండలాల వారీగా హరితహారం ప్రగతి నివేదికను పరిశీలించిన జూపల్లి జిల్లాలో శాలిగౌరారం, కేతేపల్లి, దామరచర్ల, మేళ్లచెర్వు, చిలుకూరుతో పాటు మరికొన్ని మండలాలు వెనుకంజలో ఉండడంపై మండిపడ్డారు. ఆయా మండలాల ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టు, నాన్‌ఆయకట్టుతో స ంబంధం లేకుండా అన్ని చోట్ల గుంతలు తీసిపెట్టుకోవాలని.. వర్షాలు పడే సమయానికి మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ఎంపీడీఓల పైనే ఉందన్నారు. 15 మండలాల్లో నిర్దేశించిన లక్ష్యానికంటే అతి తక్కువగా గుంతలు తీశారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామానికి 40 వేల గుంతల లక్ష్యాన్ని నిర్దేశించినందున రోజుకు రెండు వేల గుంతల చొప్పున తీయించాలని.. ఆ తర్వాత మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. తొలి అవకాశంగా అధికారులు, ఉద్యోగులపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదని.. మలిదశ సమీక్ష నాటికి హరితహారం కార్యక్రమంలో పురోగతి కనిపించకుంటే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి పథకం బాధ్యతలను ఎంపీడీఓలకే అప్పగించినందున క్షేత్రస్థాయిలో పనిచేయని ఈజీఎస్ ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం వారికే ఉందన్నారు. ఉపాధి పథకంలో కనీసం 50 శాతం కూలీల కుటుంబాలకు వంద రోజుల పని కల్పించాలన్నారు. హరితహారం కార్యక్రమంలో ఉపాధి కూలీలను భాగస్వాములు చేయాలని సూచించారు. జిల్లాకు నిర్ణయించిన 4.71 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. హరితాహారం, ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి అదనంగా ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
చిత్తశుద్ధితో పనిచేయాలి : మంత్రి జగదీశ్‌రెడ్డి
మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో చేపట్టాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. భూభాగంలో 33 శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం నల్లగొండ జిల్లాలో ఐదు శాతం మాత్రమే ఉందని, దీన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకు ప్రాధాన్యమిచ్చి ఇక్కడి నుండే హరితహారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మొక్కలు నాటడం ద్వారా రేపటి తరానికి మేలు జరుగుతుందన్నారు. ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి, మొక్కుబడిగా కాకుండా వంద శాతం గుంతలు తీయడం పూర్తి చేయాలన్నారు. వర్షాలు పడిన వెంటనే మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్.సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, డీఆర్‌ఓ రవినాయక్, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ అంజయ్యతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement