- జనగామ, గద్వాలను జిల్లాలుగా ప్రకటించాలి
- నాటా అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి గంగసాని
వరంగల్, హన్మకొండను విభజించొద్దు
Published Wed, Sep 7 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
పోచమ్మమైదాన్ : రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక వరంగల్, హన్మకొండను వేర్వేరు జిల్లాలుగా విభజించొద్దని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి గంగసాని అన్నారు. వరంగల్ పోచమ్మమైదాన్‌లోని ఓ హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోరిక మేరకు జనగామ, గద్వాలను జిల్లాలుగా ప్రకటించకుండా, కోరని హన్మకొండను జిల్లాగా ఎందుకు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా విభజన ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు తుగ్లక్ పాలనలా ఉందని ఎద్దేవా చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వల్ల డబ్బు వృథా తప్పా ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఆ ప్రాజెక్టు నిర్మించొద్దన్నారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కేసీఆర్‌ను ఎన్‌ఆర్‌ఐలే ప్రోత్సహించారని అన్నారు. గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజనాల శ్రీహరి మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. విలేకరుల సమావేశంలో నాటా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ ముత్తుజా, నాటా వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, వెల్ది ప్రభాకర్ పాల్గొన్నారు.
Advertisement