
: కొత్తగూడెం పట్టణం
కొత్తజిల్లాకేంద్రం కొత్తగూడెంలో ఇంటి అద్దె మోత మోగుతోంది. నిన్నమొన్నటి వరకు నామమాత్రపు కిరాయికి ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారు ఇప్పుడు ఏకంగా డబుల్ రెంట్ వసూలు చేస్తున్నారు.కాస్త అదనపు సౌకర్యాలు కల్పిస్తే దానికి తగినట్లే కిరాయినీ పెంచేస్తున్నారు.
- ‘కొత్త’ జిల్లాలో పెరిగిన అద్దెలు
- భవనాల కోసం అధికారుల పరుగులు
- ఇళ్ల వెతుకులాటలో ప్రభుత్వ ఉద్యోగులు
- మెయిన్ రోడ్డు వెంట కనిపించని ఖాళీ భవనాలు
- మొదలైన నిర్మాణాలు
- ఖాళీగా లేని కమర్షియల్ భవనాలు
కొత్తజిల్లాకేంద్రం కొత్తగూడెంలో ఇంటి అద్దె మోత మోగుతోంది. నిన్నమొన్నటి వరకు నామమాత్రపు కిరాయికి ఇళ్లను అద్దెకు ఇచ్చిన వారు ఇప్పుడు ఏకంగా డబుల్ రెంట్ వసూలు చేస్తున్నారు.కాస్త అదనపు సౌకర్యాలు కల్పిస్తే దానికి తగినట్లే కిరాయినీ పెంచేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగులు ఉండేందుకు ఇళ్లు కావాలని తిరుగుతుండటంతో ఇదే అదనుగా రెంట్ రెట్టింపు చేస్తున్నారు. మెయిన్‌రోడ్డు వెంట ఎక్కడ కూడా ఖాళీ భవనాలంటూ కనిపించకుండా పోయాయి. టులెట్ బోర్డు కనిపిస్తే చాలు పరుగులు తీస్తున్నారు. కొత్తజిల్లా ఆవిర్భావం నాటికి ఈ రెంట్లు మరింతగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. - కొత్తగూడెం
పట్టణం, మేజర్ పంచాయతీల్లో గృహాల సంఖ్య
-------------------------------------------------------
కొత్తగూడెం 19,100
లక్ష్మీదేవిపల్లి 4,700
చుంచుపల్లి 4,000
------------------------------------------------------
27,800
------------------------------------------------------
కొత్తగూడెం జిల్లా కేంద్రం కానుండటంతో ఇక్కడే అన్ని ప్రభుత్వ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు ప్రైవేటు అద్దె భవనాలు అవసరమయ్యాయి. అంతేకాక ప్రైవేటు సంస్థలు, వ్యాపారులు సైతం తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో వివిధ కమర్షియల్ భవనాలతోపాటు ఇళ్లకు కూడా డిమాండ్ పెరిగింది. ప్రభుత్వ కార్యాలయాల కోసం అనువుగా ఉన్న ప్రైవేటు భవనాలను వెతికేందుకు ఆయా శాఖల అధికారులు కొత్తగూడెంతోపాటు మండల పరిధిలోని చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి పంచాయతీల పరిధిలో ఇళ్లను జల్లెడ పడుతున్నారు. పట్టణంలో ఖాళీ ఇళ్లు తక్కువగా ఉండటం.. ఉన్న కొన్ని భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా లేకపోవడంతో గల్లీగల్లీ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా.. కొందరు యజమానులు మాత్రం డిమాండ్ చేసిన అద్దె చెల్లిస్తే.. అవసరమైతే భవనాలను అవసరాలకు అనుగుణంగా కట్టించి ఇస్తామని చెప్పడం గమనార్హం. ఇక పట్టణంలోని ఎంజీ రోడ్, ఇతర ప్రధాన రహదారుల వెంబడి ఖాళీ భవనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది.
జిల్లా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు తరలి రానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు అద్దెకు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటి నుంచే పలువురు ఇళ్ల యజమానులు ముందుచూపులో భాగంగా నివాస గృహాల నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న అద్దెలను కూడా గృహ యజమానులు రెండింతలు పెంచే అవకాశాలు కూడా లేకపోలేదు. జిల్లా కేంద్రం కానుండటంతో ఇటు గృహ యజమానులకు కలిసిరానుంది. ప్రస్తుతం ప్రధాన రహదారి వెంబడి గృహాల్లో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల అద్దె సుమారు రూ.2వేల నుంచి రూ.3వేలకు పైగా ఉంది. జిల్లా కేంద్రంగా ప్రకటించిన తరువాత రూ.5వేలకు పైగా పెరిగింది.
పట్టణంలో వ్యాపారాభివృద్ధికి ప్రస్తుతం కమర్షియల్ భవనాల అవసరం ఉన్నప్పటికీ ఏ ఒక్కటీ ఖాళీగా కనిపించడం లేదు. ఎంజీ రోడ్, ప్రధాన రహదారుల వెంట ఉన్న కమర్షియల్ భవనాలన్నీ నిండిపోయాయి. కొత్తగా కమర్షియల్ భవనాల నిర్మాణాలు చేపట్టేందుకు పలువురు ఖాళీ స్థలాల యజమానులు పనులు సైతం ప్రారంభించారు. భవిష్యత్‌లో కమర్షియల్ భవనాల అవసరం మరింత ఉండే అవకాశాలు ఉండటంతో దానిని దృష్టిలో పెట్టుకుని ముందుగానే కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణమైతే వివిధ వ్యాపార సంస్థలు అభివృద్ధి చెందడంతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. కాగా.. ఇప్పుడున్న అద్దెలకు రెట్టింపు స్థాయిలో పెరుగుతాయని కమర్షియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.