
రాత్రి కూతురి పెళ్లి.. ఉదయం ఆత్మహత్య!
రాత్రికి కూతురి పెళ్లి.. కట్నం డబ్బులు చేతికి అందలేదు.. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కన్నతండ్రి కౌలు చేస్తున్న పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
♦ పొలంలోనే ఉరేసుకున్న రైతు
♦ కట్నం డబ్బులకు అప్పు పుట్టలేదు
♦ వేసిన పంటలు ఎండిపోయాయి
♦ దిక్కుతోచక ప్రాణాలు తీసుకున్నాడు
♦ పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం
డిచ్‌పల్లి: రాత్రికి కూతురి పెళ్లి.. కట్నం డబ్బులు చేతికి అందలేదు.. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కన్నతండ్రి కౌలు చేస్తున్న పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన బుధవారం డిచ్‌పల్లి మండలం దూస్‌గాం నడిమితండాలో చోటు చేసుకుంది. ఎస్సై ముజిబుర్ రహ్మాన్, తండావాసుల కథనం ప్రకారం లకావత్ కసన్ (42)కు భార్య శాంతాబాయి, కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. కసన్ 4 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన వరి పంట ఎండిపోయింది. ఇటీవల ఉల్లి పంట వేయగా నీరందక చేతికి రాలేదు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. కొద్ది రోజుల క్రితం గౌరారం గ్రామానికి చెందిన అబ్బాయితో తన పెద్ద కూతురి పెళ్లి నిశ్చయిం చారు.
కట్నం కింద రూ. రెండు లక్షల నగదు, మోటార్‌సైకిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కట్నం డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం రాత్రికి కూతురి పెండ్లి చేయాల్సి ఉంది. కట్నం డబ్బులు ఇవ్వక పోతే మగపెళ్లివారితోపాటు బంధువుల వద్ద పరువు పోతోందని కసన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఉదయాన్నే ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కౌలు చేస్తున్న పంట పొలంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకున్నాడు. బయటకు వెళ్లిన కసన్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. సాయంత్రం చెట్టుకు ఉరి వేసుకుని కన్పించడంతో బోరున విలపించారు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది.
మరో ఇద్దరు రైతుల బలవన్మరణం
అమ్రాబాద్/సంగెం : అప్పులబాధతో వేర్వేరుచోట్ల ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లికి చెందిన రైతు గండికోట రాములు (55) తనకున్న మూడెకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. ఇందుకోసం రూ.రెండు లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన పంటదిగుబడి రాలేదు. అప్పులెలా తీర్చాలో తెలియక ఇంట్లోనే విషగుళికలు మింగాడు. అలాగే, వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారుగూడ గ్రామానికి చెందిన పోడేటి అయిలయ్య(55)కు ఎకరంన్నర భూమి ఉంది. దానికి తోడు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పత్తి, వరి సాగు చేశాడు. దిగుబడి ఆశించిన స్థారుులో రాలేదు. పైగా ఇద్దరు కూతుళ్ళ పెళ్లికి చేసిన అప్పులు కలిపి రూ.3 లక్షల అప్పు అయింది. ఈ ఏడాది కూడా వర్షాభావంతో పంటల దిగుబడి రాలేదు. అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో మనస్తాపం చెందిన అయిలయ్య మంగళవారం పురుగుల మందు తాగాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.