లంచగొండుల భరతం పడదాం
– ప్రజలకు ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి పిలుపు
– నేటి నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవాలు
అనంతపురం సెంట్రల్ : ‘లంచం తీసుకోవడం ఎంత నేరమో, ఇవ్వడమూ అంతే నేరం. ప్రభుత్వంతో పనులు చేయించుకోవడం ప్రజల హక్కు. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే ఏసీబీకి సమాచారమివ్వండి. వారి భరతం పడతాం’ అని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డీఎస్పీ భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల తొమ్మిదిన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం నుంచి తొమ్మిదో తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నాల్గోతేదీన పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన, ఐదున జనసంచార ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, ఆరున పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీలు, నేడున ఏసీబీ కార్యాలయం నుంచి టవర్‌క్లాక్ వరకు భారీ ర్యాలీ, తొమ్మిదిన స్థానిక అంబేడ్కర్ భవన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ, అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. చివరిరోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయడంతో పాటు చేతికి స్కై బ్లూకలర్ రిబ్బన్ కట్టుకోవాలని కోరామన్నారు. 2013 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జిల్లాలో 37 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినట్లు తెలిపారు. ఐదుగురు అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు.
17సార్లు ప్రభుత్వ శాఖల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకూ 28 కేసులు విచారణ పూర్తయ్యాయని, 19 మందిని ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించారని తెలిపారు. తొమ్మిది కేసులను కోర్టు కొట్టివేసిందన్నారు. ఎస్కేయూనివర్సిటీలో జరిగిన అవినీతి కుంభకోణాలకు సంబంధించి ఆరుగురు ఫైనాన్స్ ఆఫీసర్లు, ఐదుగురు ఆడిట్ అధికారులపై, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన మరికొంత మందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు. ప్రజాచైతన్యంతోనే అవినీతి నిర్మూలన సాధ్యమన్నారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రతియేటా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.