ఒక్కొక్కటిగా వెలుగులోకి..
♦ బయటకొస్తున్న ఎస్సై అవినీతి లీలలు
♦ డీఎస్పీ వద్దకు క్యూ కడుతున్న బాధితులు
సాక్షిప్రతినిధి, ఏలూరు : జంగారెడ్డిగూడెం ఎస్సై కేశవరావు అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎస్సై బాధితులు జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ ఎదుట క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు బాధితులు భయపడి ఎవరికీ ఫిర్యాదు చేయలేదని సమాచారం. అవినీతి బాగోతం బయటపడటంతో ధైర్యంగా బాధితులు డీఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని, తమ వద్ద ఎంతెంత సొమ్ము తీసుకుంది, సొమ్ము తీసుకుని తమను ఏ విధంగా మోసం చేశారో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. బుధవారం పెద్ద సంఖ్యలో డీఎస్పీ కార్యాలయానికి బాధితులు వచ్చారు.
ఇప్పటికే డీఎస్పీ మురళీకృష్ణ ఎస్సై వ్యవహార శైలి, అవినీతిపై విచారణ ప్రారంభించి, చాలా వరకు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. స్థానిక మార్కెట్ సమీపంలో ఒక కాంప్లెక్స్‌లో షాపును ఖాళీ చేయించేందుకు భారీ మొత్తం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏకంగా డ్రైవర్‌నే మార్చివేసి రూ.40 వేలు వసూలు చేయగా, ఆటో ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ను మార్చి రూ.20 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఇక తాడువాయి గ్రామంలో ఒక భూ వివాదానానికి సంబంధించి కూడా భారీగా వసూలు చేసినట్లు తెలిసింది. ఒక వ్యభిచార గృహంపై దాడిచేసి బెదిరించి నామమాత్రంగా కేసు నమోదు చేసి ఆ తరువాత నెలవారీ మామూళ్లు ఏర్పాటు చేసుకున్నట్లు తాజాగా బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల జంగారెడ్డిగూడెంలో పశువుల అక్రమ రవాణా వాహనాన్ని సీజ్ చేశారు.
దీనిలో కొన్ని పశువులను గోశాలకు తరలించి మరికొన్ని పశువులను అమ్మేసి వాటిని అనారోగ్యంతో ఉన్నాయనే నెపంతో మార్కెట్‌యార్డులో ఉంచినట్లు రికార్డులో చూపించారు. అయితే ఈ రికార్డులను తారుమారు చేసేందుకు మంగళవారం రాత్రి విశ్వప్రయత్నం చేసినట్లు తెలిసింది. అలాగే పేకాట కేసుల్లో దాడిచేయడం, మీపై కేసులు లేకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్న సొమ్మంతా ఇచ్చేయండి అని బెదిరించి సొమ్మును కాజేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఒక మహిళ హత్యకు గురికాగా, నిందితులను అరెస్టు చేయడం మానివేసి బాధిత కుటుంబ సభ్యులనే బెదిరించి సొమ్ములు గుంజినట్లు తెలిసింది. ఒక సాప్ట్‌వేర్ కంపెనీకి సంబంధించి వచ్చిన ఫిర్యాదులో నిందితుల నుంచే కాకుండా బాధితులపై కేసు నమోదు చేసి ఇరు వర్గాల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్న వైనం కూడా వెలుగులోకి వచ్చింది.
స్టేషన్‌కు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపైనే కేసు కడతానని బెదిరించడం, కేసు లేకుండా ఉండాలంటే సొమ్ములు ఇవ్వాలని వారి వద్దే వసూలు చేయడం లాంటి ఘటనలు డీఎస్పీ వద్దకు వచ్చినట్లు సమాచారం. తనకు నచ్చని సిబ్బందిని కూడా ఈ అధికారి వేధించినట్లు సమాచారం. వీరికి వేరే డ్యూటీలు వేసి బయటకు పంపించి నానా అవస్థలకు గురిచేసే వారని సిబ్బంది చెబుతున్నారు. స్టేషన్‌లో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేవారని, అలాగే తనకు ఇష్టమైన సిబ్బందికి అసలు డ్యూటీలే ఉండేవి కాదని సిబ్బంది చెబుతున్నారు. తన వ్యవహారాలను చక్కబెట్టడం కోసం ఒక ప్రైవేట్ డ్రైవర్‌నే కాకుండా, తాజాగా ప్రభుత్వం నియమించిన కమ్యూనిటీ పోలీసింగ్ ఆఫీసర్స్ (సీపీవో)లను కూడా ఉపయోగించుకున్నట్లు సమాచారం. వీటన్నింటిపై జిల్లా ఎస్పీ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.