టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్, విదర్భ జట్టు సారధి కరుణ్ నాయర్ (Karun Nair) విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ చేసిన కరుణ్ (101 బంతుల్లో 112; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) లిస్ట్-ఏ (50 ఓవర్ల ఫార్మాట్) క్రికెట్‌లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. కరుణ్ లిస్ట్-ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా 541 పరుగులు చేశాడు.
గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ పేరిట ఉండేది. ఫ్రాంక్లిన్ లిస్ట్-ఏ క్రికెట్‌లో ఔట్ కాకుండా 527 పరుగులు చేశాడు. కరుణ్, ఫ్రాంక్లిన్ తర్వాత ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వాన్ హీర్డెన్ (512) ఉన్నాడు.
ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు..
యూపీతో మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన కరుణ్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు చేశాడు. జమ్మూ కశ్మీర్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో అజేయ సెంచరీ (112) చేసిన కరుణ్.. ఆతర్వాత చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 44 పరుగులు చేశాడు.
ఆతర్వాత కరుణ్ వరుసగా చంఢీఘడ్ (163 నాటౌట్), తమిళనాడు (111 నాటౌట్), ఉత్తర్‌ప్రదేశ్‌లపై (112) హ్యాట్రిక్ సెంచరీలు చేశాడు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. కరుణ్ 5 ఇన్నింగ్స్‌ల్లో 542 సగటున 542 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కరుణ్ 115.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.
కరుణ్ సూపర్ సెంచరీతో మెరవడంతో యూపీపై విదర్భ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుత ఎడిషన్‌లో విదర్భకు ఇది వరుసగా ఐదో విజయం. విదర్భతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. సమీర్ రిజ్వి (82 బంతుల్లో 105; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు శతకం బాదాడు. కెప్టెన్ రింకూ సింగ్ (6) విఫలమయ్యాడు. విదర్భ బౌలర్లలో నచికేత్ భూటే నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బరిలోకి దిగిన విదర్భ 47.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కరుణ్ నాయర్‌తో పాటు యశ్ రాథోడ్ సెంచరీ చేశాడు. యశ్ 140 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూపీ బౌలర్లలో రింకూ సింగ్, బిహారీ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment