ఇందిరమ్మ బిల్లులు చెల్లించేలా కృషి
ఇందిరమ్మ బిల్లులు చెల్లించేలా కృషి
Published Fri, Sep 16 2016 5:46 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
వెల్మగూడెం(పెద్దవూర) : ప్రభుత్వం మెడలు వంచైనా పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు ఇప్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో విషయాన్ని లేవనెత్తి రెండు, మూడు నెలల్లో చెల్లించేలా కృషి చేస్తానని సీఎల్‌పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని వెల్మగూడెంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వంలో నిరుపేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి సగంలో ఆగిపోయిన ఇళ్ల బిల్లులు చెల్లించమంటే ఈ ప్రభుత్వం సాకులు చెబుతూ డబుల్, త్రిబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామంటూ దాటవేస్తుందని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు దేవుడెరుగు పెండింగ్‌లో ఉన్న బిల్లులనైనా చెల్లించాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రాంతంలో కొందరు స్వప్రయోజనాలకో, వ్యక్తిగతంగానో, కసి కోసమో, కక్ష కోసమో తగవులు పెట్టడానికి చూస్తున్నారని అన్నారు. ప్రలోభాలకు లోనుకాకుండా యువత గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నాటి సీఎం ఎన్‌టీ రామారావును ఒప్పించి, మెప్పించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసి ఈ ప్రాంతానికి తాగు, సాగునీటిని అందించినట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్, తాగు, సాగునీటితో పాటు 80 శాతం ఇళ్లు నిర్మాణం చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. అనంతరం గర్నెకుంట, వెల్మగూడెం గ్రామాల్లోనెలకొల్పిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వెల్మగూడెంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాచిరెడ్డి మాధవరెడ్డి, మాజీ ఎంపీపీ కురాకుల అంతయ్యయాదవ్, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, డీవీఎన్‌రెడ్డి, అబ్బిడి కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డి, నరాల కొండయ్య, నారాయణరెడ్డి, కిషన్‌రావు, సీహెచ్. వెంకటేశ్వర్లు, ఇంద్రకిరణ్, దేవేందర్‌రెడ్డి, సైదిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాఘవరెడ్డి, దినేష్‌నాయక్, సక్రు, కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement