సోదరా... బ్యాక్‌లాగ్‌ వద్దురా | engineering backlog special | Sakshi
Sakshi News home page

సోదరా... బ్యాక్‌లాగ్‌ వద్దురా

Published Sun, Jul 2 2017 10:50 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

సోదరా... బ్యాక్‌లాగ్‌ వద్దురా - Sakshi

సోదరా... బ్యాక్‌లాగ్‌ వద్దురా

గుదిబండలా మారే ప్రమాదం
ప్రథమ సంవత్సరం నుంచీ కష్టపడితేనే ఫలితం
ఇంజినీరింగ్‌ విద్యార్థులూ తస్మాత్‌ జాగ్రత్త
బాలాజీచెరువు(కాకినాడ) : ఎంసెట్‌ ఫలితాల విడుదల, కౌన్సెలింగ్‌లతో పాటు విద్యార్థులకు సీట్‌ ఎలాట్‌మెంట్‌ ప్రథమ దశ ప్రక్రియ పూర్తయింది. ఇంటర్‌ విద్య నుంచి ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రాంగణాల్లోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థి తనకి తాను ఓ సువిశాల స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు భావిస్తాడు. కొత్త స్నేహితులు, సరికొత్త పరిచయాలు, అధునాతన తరగతి గదులు, పరిశోధనశాలలు వంటివి తన చదువు స్థాయిని గుర్తు చేస్తుంటే... బట్టీ చదువులకు విభిన్నంగా సాగే బోధన ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కొత్తగా అనిపిస్తుంది. ఈ ఒరవడిలో... హడావుడిలో... తాను మొదటి రోజు నుంచి శ్రమించి చదవాలన్న అంశం మరుగున పడుతుంది. దీంతో మొదటి సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌లోనే కొన్ని సబ్జెక్టులు బ్యాక్‌లాగ్‌లా మిగిలి భయపెడుతుంటాయి. రానురాను అవి భారంగా మారి భవిష్యత్‌ను తలకిందులు చేస్తాయన్న విషయాన్ని వారు గుర్తెరగాలి. 
జిల్లాలో 32 ఇంజినీరింగ్‌ కళాశాలలు
జిల్లా వ్యాప్తంగా 32 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో దాదాపు ఆరు వేల మంది విద్యార్థులు ఇప్పటికే ఎంసెట్‌ ప్రథమ కౌన్సెలింగ్‌లో చేరారు. వీరందరికీ ఎలా చదవాలి, పరీక్ష విధానం ఏవిధంగా ఉంటుంది, ఎలా నడుచుకోవాలి అనేది తెలియదు. ఇదే సమయంలో వీరు పూర్తిగా స్వేచ్ఛను కోరుకోవడంతో మొదటి సంవత్సర పరీక్షల్లో ఏ కొద్దిమందో తప్ప మిగిలిన వారు బోల్తా పడతారు. రెండో సంవత్సరంలో ఆ సెమిస్టర్‌ పరీక్షలతో పాటు బ్యాక్‌లాగ్‌ (ప్రథమ సంవత్సరం) సబెక్టుల భారం ఏడాదికేడాది పెరిగి చివరికు గుడిబండగా మారిపోతాయి. 
బట్టీ చదువులకు స్వస్తి
ఇంటర్‌మీడియెట్‌లో మాదిరిగా బట్టీ చదువులు ఉండవు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఆంగ్లభాషపై పెద్దగా అవగాహన, పట్టు ఉండకపోవడంతో ఇంజినీరింగ్‌లో రాణించలేకపోతున్నారు. విషయ పరిజ్ఞానం లేని చదువుల కారణంగానే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యా నిపుణులు చెబుతున్నారు. 
పర్యవేక్షణ ఉండదు
పదో తరగతి, ఇంటర్‌మీడియెట్‌లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు ఉంటారు. కానీ ఇంజినీరింగ్‌ విద్యలో అధ్యాపకుల పర్యవేక్షణ ఉండదు. ఎవరూ అడ్డు ఉండరు కాబట్టి స్వేచ్ఛగా వ్యవహరిస్తూ చదువుపై నిర్లక్ష్యం చేస్తున్నారు. క్రింద స్థాయి చదువులో ఉపాధ్యాయుల పర్యవేక్షణతో పాటు డైలీ హోంవర్క్‌లు వంటివి ఉంటాయి. ఇంజినీరింగ్‌లో అలాంటి పరిస్ధితి ఉండదు. అధ్యాపకులు తరగతి గదిలోనే చదువు చెబుతారు. తరువాత దాన్ని అర్థం చేసుకుని, రివైజ్‌ చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థిదే.
మంచి మార్కులు వస్తేనే...
ఇంజినీరింగ్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంతో పాటు సబ్జెక్టుపై పట్టు ఉంటేనే క్యాంపస్‌ ఇంటర్వ్యూలలో సెలెక్టయి మంచి ఉద్యోగాలు సాధిస్తారు. లేకుంటే కష్టం. అలాంటిది మొదటి సెమిస్టర్‌లోనే బ్యాక్‌లాగ్‌ ఉండిపోయి చివరకు ఏదో అత్తెసరు మార్కులతో గట్టెక్కితే నెలకు ‍కనీసం రూ.10 వేల వేతనంతో కూడిన ఉద్యోగాలు దొరకడం కూడా కష్టమవుతుంది. 
ఇలా చేస్తే మేలు
- ఇంజినీరింగ్‌ విద్యలోకి ప్రవేశించగానే సీనియర్ల సలహాతో పాటు తోటి విద్యార్థులతో స్నేహబంధాన్ని బలపరచుకోవాలి.
- అధ్యాపకులు చేప్పేది శ్రద్ధగా వినాలి. అర్థం కాకపోతే మళ్లీ అడిగి తెలుసుకోవాలి.
- హాజరు 85 నుంచి 90 శాతం వరకూ ఉండి అసెన్‌మెంట్లు, స్లిప్‌టెస్టులు, మిడ్‌ఎగ్జామ్స్‌ తప్పకుండా రాయాలి.
- టెస్టుబుక్స్‌ చదవడంతో పాటు కళాశాల లైబ్రరీలోని ఆయా సబ్జెక్టుల్లోని వివిధ పుస్తకాలను అధ్యయనం చేయాలి. డిజిటల్‌ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి కనుక వాటికి అప్‌డేట్‌ అవుతూ ఉండాలి.
- కళాశాలలో జరిగే సదస్సులకు హాజరవడం ద్వారా భయంపోయి భాషా పరిజ్ఞానం పెరుగుతుంది.
- ఏ సంవత్సరం పరీక్షలను ఆ సంవత్సరమే పూర్తి చేసుకోవాలి. దీని వల్ల 70 శాతం మార్కులు సాధించవచ్చు. చాలా ప్రముఖ కంపెనీలు బీటెక్‌లో 60 శాతం మార్కులు ఉంటేనేగానీ ఇంటర్వ్యూకు పిలవడం లేదు.
కొత్తదనంతో ఇబ్బందులు
విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్‌మీడియెట్‌ వరకూ వార్షిక పరీక్షలు బట్టీపట్టి చదివి రాయడం అలవాటై ఉంటుంది. కానీ ఇంజినీరింగ్‌లో సెమిస్టర్‌ విధానం వారికి కొత్తగా ఉంటుంది. దీంతో పాటు బ్యాక్‌లాగ్‌ ఉంటే ఇంకా మూడేళ్ల సమయం ఉంది కదా అనే ధీమా వస్తుంది. సెమిస్టర్‌ విధానం వల్ల విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కానీ దీన్ని ఎవరూ గ్రహించరు. అలాగే ఇంటర్‌ పరీక్షలు రాసిన దగ్గర నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశం వరకూ దాదాపు నాలుగు నెలల విరామం ఉంటుంది. ఈ సమయంలో తము ఎంచుకునే గ్రూపుపై అవగాహన పెంచుకోవాలి. 
- పరుచూరి కృష్ణారావు, ప్రగతి ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement