పరిశ్రమ | Entrepreneurs looking for subsidies | Sakshi
Sakshi News home page

పరిశ్రమ

Published Fri, Jul 7 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

పరిశ్రమ

పరిశ్రమ

పారిశ్రామికవేత్తల రాయితీ సొమ్ము విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

రాయితీల కోసం పారిశ్రామికవేత్తల ఎదురు చూపులు
జిల్లా పరిశ్రమల కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు
అందని విద్యుత్, పావలా వడ్డీ
పెండింగ్‌లో రూ.21 కోట్లు
నేడు కలెక్టర్‌తో డీఐపీసీ సమావేశం


ఒంగోలు టూటౌన్‌: పారిశ్రామికవేత్తల రాయితీ సొమ్ము విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పలు రాయితీల కోసం నెలల తరబడి జిల్లా పరిశ్రమల కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఔత్సాహికులు పరిశ్రమకు దరఖాస్తు చేసుకోవడం మొదలు అనుమతి పొందే వరకు వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తోంది.  పారిశ్రామిక విధానంలో భాగంగా న్యాయబద్ధంగా అందాల్సిన విద్యుత్, పావలావడ్డీ, పెట్టుబడి రాయితీ, స్టాంప్‌ డ్యూటీ, అమ్మకపు పన్ను రాయితీల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. దాదాపు వెయ్యి యూనిట్ల నుంచి 1,150 యూనిట్ల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు.

గతంలో కొంతమందికి రాయితీలు మంజూరైనా.. ఎక్కువమందికి పలు రాయితీలు అందాల్సి ఉంది. వీటిలో మూడేళ్ల దరఖాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంకా 2015–16 ఆర్థిక సంవత్సరంలో పెట్టుకున్న దరఖాస్తులు క్లియర్‌ కావాల్సి ఉంది. ఇలా జిల్లాకు మంజూరు కావాల్సిన పలు రాయితీల నగదు దాదాపు రూ.21 కోట్ల వరకు మంజూరు కావాల్సిన నిధులున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పరిశ్రమల యజమానులున్నారు. వీరంతా పరిశ్రమ పెట్టడం ఒక ఎత్తైతే .. రాయితీ నిధుల కోసం తిరగడం మరొక ఎత్తు అవుతోంది.

పది నెలలుగా జరగని డీఐపీసీ  మీటింగ్‌:
జిల్లాలో డీఐపీసీసీ (జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి)  మీటింగ్‌ జరిగి దాదాపు పది నెలలు అవుతోంది. గత కలెక్టర్‌ పి.సుజాత శర్మ బదిలీకి ముందు కూడా జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలిపై సమీక్ష సమావేశం జరగలేదు. వాస్తవంగా ప్రతి మూడు నెలలకొకసారి  జిల్లా అధ్యక్షతన ఈ డీఐపీసీ  మీటింగ్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ సారి చాలా జాప్యం జరగడంతో రాయితీల కోసం చేసుకున్న దరఖాస్తులు పేరుకుపోయాయి.  పారిశ్రామిక విధానం మేరకు యూనిట్‌ ఏర్పాటు చేసి.. నిబంధనల మేరకు రాయితీలు పొందాలన్నా జిల్లా పరిశ్రమలశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవంగా జిల్లా స్థాయిలో పరిశ్రమల దరఖాస్తులపై కలెక్టర్‌ అధ్యక్షతన పరిశీలన జరగాల్సి ఉంది.

ఇక్కడ డీపీఐసీ మీటింగ్‌లో ఆమోదం పొందితేనే రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల పరిశీలనకు పంపాల్సి ఉంది. ఈ విధానం సక్రమంగా అమలు కావడం లేదన్న విమర్శలు వచ్చినా దరఖాస్తులను రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల  పరిశీలనకు పంపడంలోనూ జిల్లా పరిశ్రమలశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. గతంలో రాయితీల కోసం పంపిన దరఖాస్తులు ఎన్ని తిరిగి వచ్చాయో వాటిపైకూడా పునఃసమీక్షించి..కలెక్టర్‌ ఆమోదంతో మళ్లీ రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల పరిశీలనకు పంపాల్సి ఉంది.

నేడు జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమీక్ష:
జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనైనా.. రాయితీ దరఖాస్తులు పరిశీలన చేయనున్నారు. దాదాపు వెయ్యికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై రెండు రోజుల క్రితం జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారుల కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. దరఖాస్తులలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిశీలించారు. వాటిపైనే శుక్రవారం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగే కమిటీలో మళ్లీ సమీక్షిస్తారు. అనంతరం వాటికి ఆమోదం లభిస్తే రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారుల పరిశీలనకు పంపాల్సి ఉంది. అక్కడ అధికారులు పరిశీలించి మన జిల్లాకు రావాల్సిన  రూ.21 కోట్ల రాయితీ నిధులు మంజూరు చేస్తారు. దీనికోసం ఎంతో మంది రాయితీలు రావాల్సిన  పరిశ్రమల యజమానులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement