
కాపీ కొడుతూ పట్టుబడిన మాజీ ఎమ్మెల్యే
గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే అడ్డదార్లు తొక్కి అడ్డంగా బుక్ అయిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే పరీక్షల్లో కాపీ కొడుతూ అడ్డంగా దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.... గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ప్రధాన కార్యదర్శి మస్తాన్వలీ గురువారం లా మొదటి సంవత్సరం పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు.
నగరంలోని ఏసీ కాలేజ్లో న్యాయశాస్త్రం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన స్క్వాడ్ బృందం కాపీ కొడుతున్న పలువురిని పట్టుకున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలీతో పాటు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జిలానీ, బీజేపీ నేత భాస్కరరావు ఉన్నారు. వారి జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. స్క్వాడ్ బృందం పట్టుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో సంచలనం రేపుతోంది.