సృజనను వెలికితీసేందుకే ‘ఇన్‌స్పైర్‌’ | extricate creation is inspire's aim | Sakshi
Sakshi News home page

సృజనను వెలికితీసేందుకే ‘ఇన్‌స్పైర్‌’

Published Fri, Sep 16 2016 2:15 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

extricate creation is inspire's aim

జంగారెడ్డిగూడెం : విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఏటా ప్రతిష్టాత్మకంగా ఇన్‌సె్పౖర్‌ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు డీఈవో డి.మధుసూదనరావు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర హైస్కూల్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్‌ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఇక్కడ నిర్వహించే సైన్స్‌ ఫెయిర్‌కు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు హాజరవుతారని, అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. సైన్స్‌ఫెయిర్‌ను రాష్ట్రమంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారన్నారు.  ఇప్పటికే జిల్లాలోని ఆయా విద్యా డివిజన్‌లు ఎప్పుడు తమ ఎగ్జిబిట్‌లను ప్రదర్శించాలో షెడ్యూల్‌ ఇచ్చామని, అందరూ వారికిచ్చిన షెడ్యూల్‌ ప్రకారం సైన్స్‌ఫెయిర్‌లో హాజరుకావాలన్నారు. సైన్స్‌ఫెయిర్‌ను పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన వక్తృత్వ, వ్యాసరచన పోటీలు , 18వ తేదీన క్విజ్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. మూడు రోజులూ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 18వ తేదీ సాయంత్రం నిర్వహించి ముగింపు ఉత్సవంలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 29న టీఎల్‌ఎం ప్రదర్శన నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే అక్టోబర్‌ 15న గ్లోబల్‌ హ్యాండ్‌వాష్‌ కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఆ రోజు సైన్స్‌ ఉపాధ్యాయులంతా విధిగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. 
కంప్యూటర్‌ విద్య ప్రారంభిస్తున్నాం 
జిల్లాలోని ఆయా పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య ప్రారంభిస్తున్నామని, కంప్యూటర్‌ విద్య బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేషన్‌లో ఒక సబ్జెక్టు కంప్యూటర్‌ విద్య పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. డీఈవోడబ్ల్యూజీ డాట్‌ ఆర్గ్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 19లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 20వ తేదీన దరఖాస్తులు పరిశీలించి అదే రోజు నియామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో డీవైఈవో ఎం.తిరుమలదాసు, ఎంఈవోలు ఆర్‌.రంగయ్య, డి.సుబ్బారావు, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement