- గోవా నుంచి యథేచ్ఛగా దిగుమతి
- స్పిరిట్‌కు రంగు కలిపి మద్యం కలరింగ్
- ట్యాంకర్ల కొద్దీ కర్నూలు జిల్లాకు తరలింపు
- సహకరిస్తున్న అధికార పార్టీ నేతలు
- బెల్టు షాపుల ద్వారా భారీగా విక్రయాలు
కర్నూలు : మందుబాబుల ఆరోగ్యంతో అధికార పార్టీ దందా చేస్తోంది. కుటుంబాల్లో చీకటి మిగిల్చే నకిలీ మద్యం జిల్లాను ముంచెత్తుతోంది. ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ బాగోతంలో నాయకులు గ్రూపులను కూడా పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. పర్యవేక్షించాల్సిన శాఖ మామూళ్ల మత్తులో జోగుతుండటం.. మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు అధికార టీడీపీ నేతలే కావడం.. ఈ మహమ్మారి ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తుందోననే ఆందోళనకు తావిస్తోంది.
జిల్లాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న నకిలీ మద్యం వెనుక అసలు సూత్రధారి కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేగా తెలుస్తోంది. గోవా నుంచి భారీగా నకిలీ మద్యాన్ని కడప జిల్లాలోకి తెచ్చి దర్జాగా కర్నూలుకు ట్యాంకర్ల ద్వారా డంప్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇందుకు జిల్లాలోని అధికార పార్టీ నేతలు సహకరిస్తూ బెల్టు షాపుల ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచారం. గోవా నుంచి భారీగా నకిలీ మద్యాన్ని తీసుకుని వస్తున్న సదరు ఎమ్మెల్యే.. జిల్లాలోని టీడీపీ నేతలతో సంబంధాలు పెట్టుకుని దర్జాగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా వచ్చిన నకిలీ మద్యాన్ని(స్పిరిట్) ఇక్కడున్న అధికార పార్టీ నేతలు బ్రాండ్ మద్యంగా బెల్టుషాపుల ద్వారా మందుబాబులకు అంటగడుతున్నారు.
గోవా టు కర్నూలు వయా కడప
గోవా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు నకిలీ మద్యానికి వివిధ రంగులు కలుపుతూ అసలు మద్యానికి దీటుగా తయారు చేస్తున్నారు. ఈ నకిలీ మద్యం ట్యాంకర్లలో దర్జాగా జిల్లాలోకి వస్తోంది. ఇక్కడి అధికార పార్టీ నేతలు ఈ స్పిరిట్‌ను అసలు మద్యం సీసాలను పోలిన సీసాల్లో నింపి బెల్టు షాపులకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రొద్దుటూరు నుంచి ప్రత్యేకంగా టీంలను కూడా రప్పిస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డ కేంద్రంగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. వాస్తవానికి గతంలో గోవా నుంచి కర్ణాటకకు తెచ్చుకుంటూ అక్కడ కలర్‌ను కలిపి అసలు మద్యాన్ని తలపించేలా సిద్ధం చేసేవారు. అక్కడి నుంచి సులభంగా కర్ణాటక బోర్డర్‌లోని గ్రామాలకు సరఫరా అయ్యేది.
అయితే, గతంలో ఒకసారి డోన్ సమీపంలో నకిలీ మద్యం దొరకగా అధికార పార్టీ నేతలు ఇరుక్కున్నారు. దీంతో రూటు మార్చి ఇప్పుడు గోవా నుంచి కర్నూలు వయా కడప మీదుగా దందా సాగుతోంది. ఈ మొత్తం దందాలో అధికార పార్టీ నేతలు తమ గ్రూపులను మరిచి మరీ వ్యాపారం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది.
ఆళ్లగడ్డలో వరుస ఘటనలు.. వాస్తవానికి ఆళ్లగడ్డలో వరుసగా నకిలీ మద్యం దొరుకుతోంది. కేవలం ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది కూడా ప్రధాన కార్యాలయంలోని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ వచ్చి దాడులు చేస్తేనే నకిలీ మద్యాన్ని పట్టుకునే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీరికి ఈ నకిలీ మద్యం మాఫియా నుంచి భారీగా మామూళ్లు ముడుతుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది.
గతంలో కూడా ఇదే ఆళ్లగడ్డలో లక్ష్మీ వెంకటేశ్వర వైన్స్‌లో కల్తీ చేస్తుంటే పట్టుకుని సీజ్ చేశారు. మరోసారి ఇదే ఆళ్లగడ్డలో ఏకంగా నకిలీ మద్యాన్ని తయారుచేస్తుంటే దాడులు చేసి పట్టుకున్నారు. ఇప్పుడు కూడా తాజాగా ఆళ్లగడ్డలోని సూర్యవైన్స్‌లో కూడా ఈ తరహాలోనే నకిలీ మద్యం విక్రయిస్తూ దొరికిపోయారు. అయినప్పటికీ జిల్లాలోని ఎక్సైజ్ అధికారులకు మాత్రం చీమకుట్టినట్టుగా కూడా ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీలోని నేతలందరూ తమ గ్రూపు తగాదాలను పక్కనపెట్టి మరీ ఇప్పుడు కల్తీ మద్యం తయారీలో బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
కలర్.. ఫుల్
Published Sat, Jul 16 2016 6:30 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement