వీడని నరేష్ కేసు మిస్టరీ
♦ బైక్ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు..?
♦ ఇప్పటికీ వివరాలు వెల్లడించని పోలీసులు
సాక్షి, యాదాద్రి : కులాంతర వివాహం చేసుకున్న అంబోజు నరేష్ హత్య కేసులో న్యాయం కోసం కుటుంబ సభ్యులు, అఖిలపక్ష ప్రజాసంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. నరేష్ హత్య వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నరేష్ హత్య జరిగిన రోజు అతన్ని వాహనంపై ఎక్కించుకునిపోయిన మరో యువకుడి ఆచూకీ ఇంత వరకు పోలీసులు కనిపెట్టలేకపోయారు.
అలాగే నరేష్ హత్య అనంతరం అతడి శవాన్ని కాల్చి బూడిద చేసి మూసీలో కలిపిన అస్థికలకు సంబంధించిన నివేదిక ఇంకా బయటపెట్టలేదు. ఒక దశలో హత్యకు గురైంది నరేష్ అవునా.. కాదా..? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోందని ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తానే నరేష్‌ను చంపానని స్వాతి తండ్రి పోలీసు విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే. నరేష్, స్వాతి ప్రేమ వివాహం అనంతరం ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఆత్మహత్య చేసుకోగా నరేష్ మిస్టరీని హత్యకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు.
ఈ రెండు మరణాల వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని సీబీఐ చేత విచారణ చేయించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్, స్వాతి మరణాల వెనుక స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరికొందరి హస్తం ఉందని ఇప్పటికే ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్, స్వాతిలు మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు నరేష్ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమ కుమారుడు కనిపించకుండాపోయాడని మే 5న భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, 6వ తేదిన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నరేష్ హత్య అనంతరం నిజనిర్ధారణ కమిటీ గ్రామానికి చేరుకుని పలు అంశాలను సేకరించారు. ఆత్మహత్య చేసుకున్న స్వాతి అంత్యక్రియలు జరిగిన చోట నరేష్ అంత్యక్రియలు జరిగిన ఆనవాళ్లు లేవని నిజనిర్ధారణ కమిటీ తేల్చలేదు. కనీసం శవం కూడా దొరక్కకుండా చేశారని ఆరోపించారు.
బైక్‌పై పల్లెర్లకు...
నరేష్, స్వాతిని భువనగిరి బస్టాండ్‌లో ఆమె తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించిన అనంతరం మరో వ్యక్తితో కలిసి బైక్‌పై నరేష్ పల్లెర్ల గ్రామానికి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు. అయితే నరేష్‌ను వాహనంపై తీసుకుపోయింది ఎవరన్నది ఇంత వరకు తేలలేదు. మే 2న నరేష్ సోదరి సెల్‌ఫోన్‌లో మాట్లాడినప్పుడు అతను ఎల్‌బీనగర్ వెళ్తున్నట్లు నరేష్ చెప్పాడు. రాత్రి 11 గంటల తర్వాత ఫోన్ పనిచేయకపోవడంతో నరేష్ కుటుంబ సభ్యుల్లో అనుమానం పెరిగింది. మరో వైపు పోలీసులు సేకరించిన ఆధారాల వివరాలు వెల్లడించాలని నరేష్ కుటుంబ సభ్యులతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నరేష్‌ను హత్య చేశారా లేక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హత్య కథనం సృష్టించారా అన్నది తేల్చాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు కులసంఘాలు, ప్రజాసంఘాలు సీఎంను కలిసే ఆలోచనలో ఉన్నాయి.
కేసు ఇలా...
మే 2న ముంబాయి నుంచి భువనగిరికి వచ్చారు. అదే రోజు స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డికి నరేష్, స్వాతిని అప్పగించారు. ఆ రోజు నుంచి నరేష్ కనిపించకుండాపోయాడు. మే 5న తన కుమారుడు కనిపించడం లేదని నరేష్ తండ్రి వెంకటయ్య భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 6న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 16వ తేదీన స్వాతి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. మే 27న ఎల్‌బీనగర్ పోలీసుల విచారణలో నరేష్‌ను తానే హత్య చేశానని స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. కేసు నమోదు చేశారు.
మే 30న నిజనిర్ధారణ కమిటీ నరేష్, స్వాతిల స్వగ్రామమైన ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల, లింగరాజుపల్లి గ్రామాలను సందర్శించి హత్యపై అనుమానాలు వ్యక్తం చేశారు. జూన్ 9న భువనగిరిలో నరేష్ హంతకులను శిక్షించాలని అఖిలపక్షాల సమావేశం జరిగింది. మే 12న సీఎంను కలవాలని అఖిలపక్ష ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. జూన్ 16న సీఎస్‌ను కలిశారు. జూన్ 22న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ను కలిసి నరేష్, స్వాతి హత్యోదంతంలో నిజనిజాలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు