ఇదేం పని! | Farmers Bazaar moved for CM temporary camp | Sakshi
Sakshi News home page

ఇదేం పని!

Published Sun, Mar 27 2016 3:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM

ఇదేం పని! - Sakshi

ఇదేం పని!

స్వరాజ్యమైదాన్ రైతుబజారు
తరలింపు నిర్ణయంపై అభ్యంతరాలు
కాల్వ గట్టుపై వ్యాపారాలు ఎలా అంటూ
రైతులు, వ్యాపారుల ఆందోళన
నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్

 రైతుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా.. ప్రజల సౌకర్యం పట్టించుకోకుండా సర్కారు ఏకపక్ష నిర్ణయంతో స్వరాజ్య మైదానం రైతుబజార్‌ను తరలించేందుకు నిర్ణయించింది. సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం కోసం.. రైతులకు అనుకూలంగా ఉండి ఏళ్లతరబడి కొనసాగుతున్న రైతుబజార్‌ను తరలించేందుకు నిర్ణయించటంపై రైతులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ కట్టపై స్థల పరిశీలన చేసి నమూనాల రూపకల్పనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

విజయవాడ : నగరం నడిబోడ్డున అందరికీ అందుబాటులో, సౌకర్యంగా ఉన్న స్వరాజ్య మైదానం రైతుబజారును సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ కట్టపైకి తరలించేందుకు సర్కారు నిర్ణయించటంపై జనంలో కలకలం మొదలైంది. ఏడాది రెండేళ్ల అవసరం కోసం ఏళ్లతరబడి లక్షలాదిమంది వినియోగదారులకు, వేలాదిమంది రైతులు, వ్యాపారులకు ఎంతో తోడ్పడుతున్న రైతుబజారును విధ్వంసం చేస్తారా అని ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. రైతులు, ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయించటంపై ధ్వజమెత్తుతున్నారు. ఓ వైపు అమరావతి రాజధాని రెండేళ్లలోపు నిర్మిస్తామని, అక్కడే తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో ఏర్పాటు చేస్తున్నామని చెబుతూనే.. మరోపక్క సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం సెక్యూరిటీ జోన్ పేరుతో రైతుబజారును తొలగించేందుకు నిర్ణయించటంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండి, అన్ని హంగులతో వెలుగొందుతున్న రైతుబజారును నాశనం చేయొద్దని కోరుతున్నారు.

 రెండేళ్ల క్రితమే ఆధునికీకరణ...
స్వరాజ్యమైదానంలోని ఎకరం విస్తీర్ణంలో రైతుబజార్‌ను 1999లో ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం దాదాపు కోటి రూపాయల నిధులతో పక్కా షెడ్లు కూడా నిర్మించి ఆధునికీకరించారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాటికి ప్రారంభోత్సవం కూడా చేసి, ఇది తమ ప్రభుత్వ ఘనతేనని కూడా చెప్పుకొన్నారు. మరో కోటి రూపాయలతో ఆధునికీకరించి మోడల్ బజార్‌గా తీర్చిదిద్దుతామని వాగ్దానం కూడా చేశారు. ప్రస్తుతం ఈ రైతుబజారులో 208 మంది రైతులు, 107 మంది వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు, వారితో పాటు పనిచేసే సుమారు 1500 మంది రకరకాల కూరగాయలు, ఆకు కూరలు విక్రయిస్తున్నారు.

 రెండు జిల్లాల్లో వినియోగదారులు...
నిత్యం ఈ రైతుబజారుకు నగరం నలుమూలల నుంచే గాక, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వేలాదిమంది కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ఆదివారం, సెలవు రోజుల్లో రోజుకు 20 వేల మంది వరకు వస్తుంటారని అంచనా. బందరు రోడ్డుకు ఆనుకుని, అటు ఐదో నంబర్ రోడ్డుకు, ఏలూరు రోడ్డులో కలవటానికి అతి తక్కువ దూరంలో ఉన్న స్వరాజ్య మైదానం రైతు బజార్ అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉంది. ఓ వైపు ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, ఆస్పత్రులు, వివిధ రకాల పనులపై కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి వెళ్లేవారు ఇక్కడి రైతుబజార్ చాలా అనుకూలంగా ఉంటుందని చెపుతున్నారు. కాల్వగట్టు పైకి తరలిస్తే రైతుబజార్ నిర్వీర్యం అవుతుందని రైతులు వాపోతున్నారు. తద్వారా తమ పార్టీ కార్యకర్తలు నడుపుతున్న ప్రైవేటు రైతుబజార్లు పుంజుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న రైతులు, వ్యాపారుల అభిప్రాయం తెలుసుకోకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు.

దశలవారీగా అనుమతుల నిరాకరణ
దశాబ్దాలుగా నగరానికి వేసవి వినోదం అందించిన ఎగ్జిబిషన్‌కు గ్రహణం పట్టింది. స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌కు సెక్యూరిటీ జోన్ పేరుతో అనుమతినివ్వడం లేదు. దీంతో రెండు జిల్లాల ప్రజలు వేసవి వినోదానికి దూరమవుతున్నారు.

అతి పెద్ద పుస్తక మహోత్సవం నిర్వహణకు కూడా స్వరాజ్య మైదానమే వేదికగా ఉంది. దీనికి ఈ ఏడాదే కనాకష్టంగా స్థలం, దుకాణాల సంఖ్య తగ్గించి అనుమతులు ఇచ్చిన సర్కారు.. వచ్చే ఏడాదికి ఎలా వ్యవహరిస్తుందో అనే అనుమానాలు నెలకొన్నాయి.

{పస్తుతం స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్న లేపాక్షి వంటి ఓ మోస్తరు ప్రదర్శనల నిర్వహణ కూడా రానున్న రోజుల్లో కష్టంగా మారే పరిస్థితి నెలకొననుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సెలవొస్తే నగరంలోని ఆబాలగోపాలం క్రికెట్ ఆడుకోవడానికి స్వరాజ్య మైదానం వేదికగా ఉండేది. ఇప్పుడు వారినీ అనుమతించే పరిస్థితి లేదు. దీంతో వారంతా ఆటలకు ఎక్కడికెళ్లాలనేది ప్రశ్నార్థకంగా మారింది.

తరలించవద్దు
రైతుబజారు ఏర్పాటైన నాటి నుంచి మునక్కాయలు, మామిడి కాయలు విక్రయించుకుని జీవిస్తున్నాం. నా తండ్రి ఇక్కడే వ్యాపారం ప్రారంభించి నాకు అప్పగించాడు. రైతులకు, వినియోగదారులకు అనుకూలంగా ఉన్న రైతుబజార్‌ను కాల్వగట్టు పైకి తరలించటం తగదు. దీనివల్ల మా వ్యాపారాలు పడిపోతాయి. అనుకూలంగా లేని ప్రదేశానికి ప్రజలు రారు. అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి.
- మరీదు శ్రీనివాసరావు, రైతు, పాతపాడు

వ్యాపారం సాగదు
స్వరాజ్యమైదానంలో సాగినంత వ్యాపారం కాల్వగట్టుపై సాగదు. నగరంలో ఇంకా నాలుగు చోట్ల రైతు బజార్‌లు ఉన్నా అందరికీ అనుకూలంగా ఉన్న స్వరాజ్యమైదానం బజార్‌కు అధిక డిమాండ్ ఉంది. ఇక్కడ సాగినంత వ్యాపారం మరెక్కడా ఉండదు. దీన్ని మార్చితే మా వ్యాపారాలు మూతపడినట్లే. అధికారులు పునరాలోచన చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ రైతుబజార్‌ను తరలించకూడదు.
- అమ్మిశెట్టి సుబ్బారావు, మిర్చి రైతు, కుంచనపల్లి

ప్రైవేటు బజార్ల కోసమే
ప్రైవేటు రైతుబజార్లు ఏర్పాటు చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారు. ప్రభుత్వ రైతుబజార్లు సాగితే ప్రైవేటు బజార్లకు జనం వెళ్లరు. నగరంలో అతి పెద్దదైన ఈ బజార్‌ను తీసివేస్తే అధికార పార్టీ నేతల అనుచరులు ప్రైవేటు బజార్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్రహ్మాండంగా నడుస్తున్న రైతుబజార్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. ఇది మంచి పని కాదు. విరమించుకోవాలి.
- జి.షరాబ్, మామిడి రైతు, పి.నైనవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement