
రైతు సమస్యల సమరశీల పోరాటాలే ఎజెండా
–ఈనెల 29 నుంచి 31 వరకు కడపలో రాష్ట్రస్థాయి వర్కషాపు
–ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రామచంద్రయ్య
కడప అగ్రికల్చర్ :
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలే ఎజెండాగా ముందుకు సాగాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. రామచంద్రయ్య పిలుపు నిచ్చారు. ఆదివారం కడప నగరంలోని ఎద్దుల ఈశ్వరరెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలక ప్రభుత్వాలు అధికారంలోకి రాక ముందు సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని గట్టెక్కిస్తామని, రైతులు తీసుకున్న రుణాలన్నింటిని మాఫీ చేస్తామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకోగానే రుణమాఫీ మరచి కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేశారని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు ఒరిగిందేమి లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి కొరవడిన కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని అన్నారు. అటు ప్రభుత్వం నుంచి పరిహారం అందక, మరో పక్క రుణమాఫీకాక, బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించలేక అవమాన భారాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండడం బాధకరమన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్‌గా మారుస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చందరబాబునాయుడు అటు ఉద్యానశాఖకు నిధుల్లో కోతకోసి, సాగు నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయించకుండా సాగు నీరు ఎలా ఇస్తారో, ఎలా హబ్‌గా మారుస్తారో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూలంకషంగా చర్చించడానికి ఈనెల 29 నుంచి 31 కడపలో రాష్ట్రస్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, చంద్ర, కార్యనిర్వహక అధ్యక్షులు ఏవి రమణ, రైతు సంఘం నాయకులు రాహుల్, బాలచంద్రయ్య, మల్లిఖార్జునరెడ్డి, రామలింగారెడ్డి, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.