వేగంగా పుష్కరఘాట్ నిర్మాణ పనులు
వేగంగా పుష్కరఘాట్ నిర్మాణ పనులు
Published Tue, Aug 2 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
నేరేడుచర్ల : మండలంలోని మహంకాళిగూడెం వద్ద పుష్కర ఘాట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఘాట్ ఇన్‌చార్జి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఘాట్ నిర్మాణానికి రూ. 2.65 కోట్లు మంజూరు కాగా, గతంలో ఉన్న ఘాట్‌కు అదనంగా 60 మీటర్ల మేరకు విస్తరించి మెట్లు నిర్మించారు. ప్రస్తుతం రక్షణ కోసం ఇనుప జాలీలను నిర్మిస్తున్నారు. పుష్కర ఘాట్‌లో యాత్రికుల సౌకర్యార్ధం 10 స్నానపు గదులు, 10 మరుగు దొడ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహంకాళీగూడెంనకు బీటీ రెన్యువల్ పనులు మండలంలోని నర్సయ్యగూడెం నుంచి గుడగుండ్ల పాలెం వరకు పూర్తి చేశారు. పుష్కరఘాట్ నుంచి 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహంకాళీగూడెం దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లే రహదారికి రూ. 45 లక్షలు మంజూరు చేయగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నేరేడుచర్లలోని బైపాస్ రోడ్డుకు హుజుర్‌నగర్ రోడ్డు నుంచి జాన్‌పహాడ్ రోడ్డు వరకు బీటీ నిర్మాణ పనులు చేపడుతుండగా, మిర్యాలగూడ రోడ్డు నుంచి జాన్‌పహాడ్ రోడ్డు వరకు రూ. 20 లక్షలతో మెటల్ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఘాట్ సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మంచినీటి సౌకర్యం కోసం రూ. 15.32 లక్షలతో నీటి శుద్ధి యంత్రాన్ని అమర్చేందుకు తాత్కాలిక గదిని నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం పలు చోట్ల మంచినీటి నల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కొరకు మహంకాళీగూడెం గ్రామ శివారులోని పార్కింగ్ స్థలాలను చదును చేస్తున్నారు.
నీరు వస్తేనే పుష్కరస్నానం
పుష్కర ఘాట్ వద్ద ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి సుమారు 15 అడుగుల ఎత్తులో ఘాట్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో నదిలో నీటి మట్టం పెరిగితేనే ఘాట్‌లో స్నానం ఆచరించేందుకు వీలు ఉంటుంది. ఆగస్టు 12 పుష్కరాల ప్రారంభం రోజు వరకు ఘాట్‌లోకి నీరు వస్తుందని అటు అధికారం యంత్రాంగం, ఇటు ప్రజలు భావిస్తున్నారు. గతంలో పుష్కరాలకు హాజరైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Advertisement