రైతన్న కోసం పోరాటం
మైదుకూరు టౌన్:
సాగునీటి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తెలియజేసేందుకు ఈనెల 29న కడప కలెక్టరేట్ వద్ద రైతు మహాధర్నా చేపట్టినట్లు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలపరిధిలోని ఎన్.ఎర్రబల్లిలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకోసం ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఖరీఫ్ ప్రారంభం కావడంతో రైతులు వరినారు మడులు వేసుకున్నారని, కాని కెసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారడంతో వరి సాగుచేయాలా.? వద్దా? అనే అయోమయం నెలకొందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులు మించి 150 టీఎంసీలు నీరు ఉన్నా రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని అందించేందుకు సీఎం చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రజల కష్టాలు బాబుకు పట్టడం లేదన్నారు. రైతులకోసం అదిచేస్తాం.. ఇది చేస్తామని చెబుతున్నారేకాని, పంటలకు కావాల్సిన నీరు అందించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నీరు–చెట్టు పనులపై శ్రద్ధ చూపుతున్నారేకానీ రైతులకు అవసరమైన సాగునీటికోసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సాగునీటిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 29న అనగా సోమవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించే మహధర్నాను జిల్లాలోని రైతులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.