
ప్రజా సమస్యలే ప్రధానాస్త్రం
►అసెంబ్లీలో జిల్లా ఎమ్మెల్యేల పోరాటం
►బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలన్న పెద్దిరెడ్డి
►ప్రభుత్వ భూముల ఆక్రమణపై చెవిరెడ్డి ధ్వజం
►డ్వాక్రా రుణాల మాఫీపై నినదించిన రోజా
తిరుపతి: అసెంబ్లీ సమావేశాల్లో జిల్లా శాసనసభ్యుల వాణి ఊపందుకుంది. ప్రజా సమస్యలే ప్రధానాస్త్రంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల హామీలను గాలికొదిలి రాష్ట్ర ప్రజలను అధికార పార్టీ మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాకు చెందిన పుంగనూరు, చంద్రగిరి, నగరి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజా తమదైన శైలిలో ప్రజా సమస్యలను, సంక్షేమ పథకాల అమల్లో సర్కారు వైఫల్యాలపై వ్యూహాత్మకంగా ధ్వజమెత్తు తున్నారు. తిరుపతి రూరల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ధ్వజమెత్తిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను ఎత్తిచూపారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుడగ జంగాల సమస్యలను లేవనెత్తారు.
ప్రభుత్వంపై రోజా ఫైర్
గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో నగరి ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం తీరుపై భగ్గుమన్నారు. డ్వాక్రా మహిళల రుణ మాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు లోపించిన రక్షణ, గోరుముద్దల పథకం అమల్లో లోపాలను ప్రస్తావించారు. 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.14,200 కోట్ల రుణ మాఫీ చేయాల్సి ఉంటే, బడ్జెట్‌లో అరకొర నిధులు కేటాయించడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లాకు చెందిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, పీలేరు, మదనపల్లి ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డిలు సమయం దొరికినప్పుడు, సందర్భం వచ్చినపుడు ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజల అవసరాలను గుర్తు చేస్తున్నారు.