బుర్రిపాలెంలో బ్రహ్మోత్సవం
► ప్రిన్స్ మహేశ్‌బాబు రాకతో మిన్నంటిన కోలాహలం
► వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, గ్రామస్తులు
► సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తానని మహేశ్ వెల్లడి
► పేద మహిళలకు ఇళ్ల స్థల పట్టాల పంపిణీ
తెనాలి : ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ఘట్టం రానేవచ్చింది. తమ అభిమాన హీరో, ప్రిన్స్ మహేశ్‌బాబు రానున్న సమాచారం తెలిసి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు ఆదివారం నిజంగా పండగరోజయింది. ఉదయం నుంచి గ్రామంలో సందడి చేశారు. తెనాలి నుంచి, పరిసర గ్రామాల నుంచి ఏది దొరికితే ఆ వాహనంలో చేరుకున్న అభిమానులు, మహేశ్ పర్యటన మార్గానికి ఇరువైపుల వేచిఉండటమే కాదు, ఆ దారిలో ప్రతి మేడ, గోడ, చెట్టు...అభిమానులతో నిండిపోయింది. ఎండ ఒక పక్క ముచ్చెమటలు పట్టిస్తున్నా, దాహం వేస్తున్నా ఖాతరు చేసినవారు లేరు.
మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత గ్రామానికి చేరుకున్న వెండితెర శ్రీమంతుడిని చూసి అంతా కేరింతలు కొట్టారు. చేతులు ఊపి సంతోషాన్ని తెలియ జేయటమే కాదు..సెల్‌ఫోన్లతో వీడియోలు, ఫోటోలు తీయటంలో మునిగిపోయారు. నేరుగా తమ ఇంటికి చేరుకున్న మహేశ్‌బాబు, రెండు మూడు పర్యాయాలు బయటకొచ్చి డాబాపైనుంచి చేతులూపుతూ కుర్రకారును మరింత కిర్రెక్కించారు. అదే భవనంలో మరో డాబాపై విలేకరుల సమావేశం, అక్కడే వనరులు, రుణ అర్హత కార్డులు, ఆరోగ్య కార్డులను పంపిణీ చేశాక, టాపులేని వాహనంపై బయలుదేరిన మహేశ్‌ను చూసి అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.
మహేశ్ చేతుల మీదుగా..
గ్రామంలో అభివృద్ధి పనులే కాకుండా, సామాజిక మార్పునకు ప్రయత్నం చేస్తామని ప్రిన్స్ మహేశ్ బాబు ఈ సందర్భంగా చెప్పారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తండ్రి సోదరు డు జి.ఆదిశేషగిరిరావుతో కలిసి మహేశ్ బాబు విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో చేపట్టనున్న కార్యక్రమాలతోపాటు అక్కడే ప్రభుత్వానికి చెందిన వివిధ వనరులను లబ్ధిదారులకు అందజేశారు. పేద మహిళలు వెంకటేశ్వరమ్మ, పాపమ్మకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కిలారి రాజేష్‌కు కౌలురైతు రుణ అర్హత గుర్తింపు కార్డు అందజేశారు. డ్వాక్రా గ్రూపులకు కోటి రూపాయల చెక్కు అందించారు.
మహేశ్‌తో కలిసి బుర్రిపాలెం గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణకు ముందుకొచ్చిన ఆంధ్రా హాస్పటల్ ఆధ్వర్యంలో ఆరోగ్య కార్డులను గ్రామసర్పంచ్ కొండూరి సామ్రాజ్యం, కంచర్ల ఏసుదాసు, పెమ్మసాని సంపతయ్యకు అందజేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యకార్డు లు ఇచ్చి, ప్రతి రెం డు నెలలకోసారి వైద్యశిబిరాలను నిర్వహిస్తామని ఆ హాస్పటల్ చైర్మన్ డాక్టర్ రమణ వెల్లడించారు. ఆర్నెల్లకోసారి పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని చెప్పారు. గ్రామస్తులకు తమ హాస్పటల్లో స్పెషలిస్టు వైద్యపరీక్షలు ఉచితంగానే చేస్తామని ప్రకటించారు.
ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఒకటో తరగతిలో చేరనున్న ఇద్దరు బాలికలకు తగిన పత్రాలను ఇచ్చారు. మచిలీపట్నం దగ్గర్లోని ఘంటసాల శివారు దేవరకోటలో ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి మహేశ్‌బాబు అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు తీసుకొచ్చిన చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
ఆదర్శగ్రామంగా బుర్రిపాలెం...
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, చిత్తూరులో తమ తల్లిదండ్రుల ఊర్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేశామని చెప్పారు. తన అత్తగారి ఊరయిన బుర్రిపాలెంను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని సంకల్పించినపుడు, ప్రధానమంత్రి గ్రామయోజన పథకంలో నిబంధనతో వీలు కాలేదన్నారు. ఫలితంగానే తన భార్య పద్మావతి, మహేష్‌బాబుకు చెరొక గ్రామం దత్తత తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాలు, పైపులైను, అదనపు తరగతి గదులు నిర్మించి గ్రామాన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ప్రముఖ నిర్మాత, హీరో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ, మహేష్, ఎంపీ జయదేవ్‌లు గ్రామాభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్టు చెప్పా రు. గ్రామాన్ని బాగు చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. మహేశ్, జయదేవ్‌ల చొరవతో బుర్రిపాలెం రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా రూపొందగలదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. మహేశ్‌బాబు చేపట్టిన దత్తత కార్యక్రమం మరెం దరికో స్ఫూర్తి కాగలదన్నారు. తెనాలి ఆర్డీవో జి.నర్సిం హులు, ఎంపీపీ ఎస్.వెంకట్రావు, తహశీల్దారు జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అమిరినేని రాజా, సౌపాటి కిరణ్, బుర్రిపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు.