నల్లమలలో రూ. 22లక్షలతో ఫైర్‌లైన్స్
Published Fri, Mar 3 2017 11:58 PM | Last Updated on Wed, Sep 5 2018 9:51 PM
- డీఎఫ్‌ఓ శివప్రసాద్
మహానంది: వేసవిలో నల్లమల సంరక్షణకు రూ. 22లక్షలు వెచ్చించి 200 కిలోమీటర్ల మేరకు ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేశామని డీఎఫ్‌ఓ శివప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక అటవీ పర్యావరణ కేంద్రం నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నల్లమల అడవిలో అగ్ని ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు తాత్కాలికంగా 55 మందిని ఫైర్‌వాచర్స్‌గా తీసుకున్నామన్నారు. ప్రస్తుతం బేస్‌క్యాంపుల్లో 65 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారని తెలిపారు.
వన్యప్రాణులకు తాగునీరు అందించేందుకు నంద్యాల, రుద్రవరం డివిజన్‌లలో 60 సాసర్ పిట్స్ ఉన్నాయన్నారు. వీటికి అదనంగా కొత్తగా 40 నిర్మించామన్నారు. వీటికి ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపుతామని తెలిపారు. ప్రతి రోజూ నంద్యాల–గిద్దలూరు రహదారిలోని ఘాట్‌రోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అటవీపర్యావరణ కేంద్రం పరిధిలోని రెండో నర్సరీలో మొక్కలు ఎండిపోవడంపై డీఎఫ్‌ఓ శివప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్షం రోజుల్లో పరిసరాలు మారాలని సిబ్బందిని ఆదేశించారు. నంద్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, డీఆర్‌ఓ రఘుశంకర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Advertisement