మహానంది: వెలుగుల పండుగ దీపావళి నాడు ఆ ఇళ్లలో చీకట్లు అలుముకున్నాయి. గురువారం ఉదయం గాజులపల్లె గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 పేద కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాయి. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద చింతల సుబ్రమణ్యం, బాలసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, సుబ్బరాయుడు, సుబ్రమణ్యం, నాగినేని వెంకటేశ్వర్లు, గద్వాల నాగేశు, జమ్ములమ్మ. సంజీవరాయుడు, సంజమ్మ, మల్లికార్జున, రంగనాయకులు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. వీరంతా నిరుపేదలు. కొందరు చంద్రికలు అల్లుతూ జీవిస్తుండగా, మరి కొందరు కూలీకి వెళ్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో చింతల సుబ్రమణ్యం ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మొదట మంటలు చెలరేగాయి. వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగానే పక్కన ఉన్న వారి గుడిసెలు మంటలు ఎగిశాయి. పక్క పక్కనే గుడిసెలు ఉండటంతో పాటు మంటలు వ్యాపించడంతో ఇళ్లల్లోని వస్తువులు తీసుకోలేకపోయారు.
సర్వం కోల్పోయిన బాధితులు
ఆగ్ని ప్రమాదంలో బాధితులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కష్టపడి కూడిబెట్టిన నగదు, ఎంతో ప్రేమతో కొనుకొన్న చిన్న చిన్న బంగారు ఆభరణాలు, తినడానికి దాచుకున్న బియ్యం, బేడలు, టీవీలు, ఫ్యాన్లు, ఇతర వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. మల్లికార్జున ఇంట్లో రూ. 15వేల నగదుతో పాటు అన్ని వస్తువులు బూడిదయ్యాయి. అలాగే రూ. 50వేలు అప్పు తెచ్చి చీరల వ్యాపారం చేసే సంజమ్మ ఇంట్లో అన్ని కాలిపోయాయి. కుమార్తెకు కట్నం కింద బంగారు ఇచ్చేందుకు ఆరు మేకపోతులను అమ్మి రూ. 25వేలు దాచుకుని ఉంటే కాలిపోయాయని సంజీవరాయుడు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు.
కొడుకు కేరళలో ఉంటూ కష్టపడి బేల్‌దార్ పనిచేస్తూ కూడబెట్టిన రూ. 25వేల నగదు బూడిదయ్యాయని తమిమనేని రాములమ్మ, నాగేశ్వరరావు దంపతులు విలపించారు. కట్టుకున్న ఇంటి అప్పును తీర్చేందుకు పొదుపులో రూ. 20 వేలు రునం తీసుకున్నామని, కాలిపోయినట్లు లక్ష్మీనరసమ్మ వాపోయింది. ఈ సంఘటనలో సుమారు రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఏసీ సుబ్బరాయుడు సంఘటన స్థలానికి వెళ్లి తన సొంత డబ్బుతో 12 కుటుంబాల వారికి బియ్యం, కందిబేడలు, నూనె, తదితర వస్తువులను అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కొండారెడ్డి, మధుసూదన్‌రెడ్డి వారికి ఆహారం అందించారు.
మొదట మా ఇంట్లోనే మంటలు: అగ్నిప్రమాదంలో మొదటగా మా ఇంట్లోనే మంటలు వ్యాపించాయి. అందరం కట్టుబట్టలతో మిగిలాం. రూ. 25వేల నగదుతో పాటు విలువైన చంద్రికలు కాలిపోయాయి. బంగారు వస్తువులు, పిల్లల పుస్తకాలు, రేషన్‌కార్డులు, అన్ని మంటల్లో మాడిపోయాయి. బియ్యం, బేడలు, మంచాలు, రేషన్‌కార్డులు, ఇతర వస్తువులన్నీ కాలాయి. ఒక్కటీ కూడా తీసుకోలేకపోయాం.
Comments
Please login to add a commentAdd a comment