- 52 సబ్సీడీ లడ్డూ టోకెన్లు, రూ.10,520 నగదు స్వాధీనం
సాక్షి,తిరుమల
తిరుమలలో మంగళవారం ఐదు మంది లడ్డూ దళారులు పట్టుబడ్డారు. తమిళనాడులోని రామనాథపురంకు చెందిన ట్యాక్సీడ్రైవరు టి.ప్రభు (26) , మధురైకు చెందిన సి.సెంథిల్‌కుమార్ (34), వరంగల్‌జిల్లాకు చెందిన ఏ.రమేష్ (30), ప్రకాశం జిల్లాకు చెందిన ఎం.నాగార్జున (20), బెంగళూరుకు చెందిన సి.సుబ్రమణ్యం (20) జట్టుగా ఏర్పడ్డారు.
వీరంతా క్యూలైన్లలో సర్వదర్శనానికి వెళతారు. అక్కడ సబ్సిడీ ధరతో రూ.70 నాలుగు లడ్డూలతోపాటు దొడ్డిదారుల్లో మరికొన్ని లడ్డూ టోకెన్లు పొందుతారు. వీటిని ఆలయం వెలుపల ఒక్కో లడ్డూ రూ.50 నుండి రూ.100 వరకు విక్రయిస్తుంటారు. వీరిని మంగళవారం టూ టౌన్ సీఐ వెంటకరవి, ఎస్‌ఐ వెంకట్రమణ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మొత్తం 52 లడ్డూలకు సంబంధించిన టోకెన్లు, రూ.10,520 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెంకటరవి తెలిపారు. ఇలాంటి దళారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షింబోమని, దళారుల సమాచారం ఉంటే తక్షణమే స్పందిస్తామన్నారు.