అనుమతిలేని ఫ్లెక్సీలపై గరం..గరం..
► బాధ్యులపై చర్య తీసుకోవాలని సభ్యుల డిమాండ్
► ఆక్రమణలను ప్రోత్సహించవద్దని ఆదేశం
► స్టాండింగ్ కమిటీ
► సమావేశంలో నిర్ణయం
కరీంనగర్ కార్పొరేషన్ : ఫ్లెక్సీలను నిషేధించి మూడు నెలలు గడుస్తున్నా నగరంలో విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయని, అధికారులు ఏం చేస్తున్నారని స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు నిలదీశారు. అధికారుల అలసత్వంపై మండిపడ్డారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించారు.
ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయొద్దని నిర్ణరుుంచామని, అధికారుల నిర్లక్ష్యంతో నగరంలో మళ్లీ కనిపిస్తున్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార, విపక్ష పార్టీలనే తేడా లేకుండా ఎవరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తొలగించాలని సూచించారు. 57 అంశాల ఎజెండాలో 53 అంశాలకు ఆమోదం తెలిపారు. అంకెలు తప్పులుగా ముద్రించిన 4 అంశాలను పక్కనబెట్టారు. అదే విధంగా రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని వెంటనే గుడారాలు తొలగించాలన్నారు. సభ్యులు ఏవీ రమణ, లంక రవీందర్, ఎడ్ల సరిత, కట్ల విద్య, కమిషనర్ ఎం.వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు.
నాణ్యతలేని లైట్లు బిగించవద్దు : మేయర్
నాణ్యతలేని లైట్లు సరఫరా అవుతున్నాయని, థర్డ్‌పార్టీ క్వాలిటీ చేరుుంచాలని నగర మేయర్ రవీందర్‌సింగ్ అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ విద్యుత్ విభాగంలో గురువారం తనిఖీలు చేపట్టారు. నాణ్యతలేని లైట్లు వారంలోపే పాడవుతున్నాయని కార్పొరేటర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఈ సమస్య తిరిగి ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నకిలీ మెటీరియల్ పంపించే ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని స్తంభాలకు లెడ్ బల్బులు బిగించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.