ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించండి
ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పక పాటించాలని రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు ఆదేశించారు.
- పోలీసు అధికారులకు సీమ ఐజీ ఆదేశం
కర్నూలు : ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలను తప్పక పాటించాలని రాయలసీమ ఐజీ ఎన్.శ్రీధర్‌రావు ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డీఎస్పీలతో ఐజీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ బి.వి.రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను మొత్తం సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా చిత్రీకరించాలన్నారు. ఎన్నికల వెబ్‌సైట్‌లను ప్రతిరోజూ గంటకోసారి గమనిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాలన్నారు.
కర్నూలు, నంద్యాల, ఆదోని పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పూర్తిగా నిఘా ఉంచాలన్నారు. జిల్లా పోలీసులతో పాటు కేంద్ర పోలీసు బలగాలను ఉపయోగించుకుని ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. డీఐజీ రమణకుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిని కట్టడి చేయాలన్నారు. నేర ప్రవృత్తి గల రౌడీల కదలికలపై నిఘా పెంచాలన్నారు. బ్యాలెట్ బాక్సులు తరలించేటప్పుడు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
నాన్‌బెయిలబుల్ వారెంట్ల వివరాలు, బైండోవర్ కేసులు, లైసెన్స్ ఆయుధాల స్వాధీన వివరాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఎంతమంది ఓటింగ్‌కు హాజరవుతున్నారనే విషయాలను ఎన్నికల బందోబస్తు విధులకు నియమించే సిబ్బంది వివరాలు ఎస్పీ, ఐజీకి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. డీజీపీ ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ రవిప్రకాష్, అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, జె.బాబుప్రసాద్, ఈశ్వర్‌రెడ్డి, కొల్లి శ్రీనివాసరావు, మురళీధర్, వినోద్‌కుమార్, వెంకటాద్రి, బాబా ఫకృద్దీన్, హుసేన్ పీరా, సీఐలు పవన్‌కిషోర్, ఇస్మాయిల్, రామాంజనేయులు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.