రహదారి విస్తరణకు భూములివ్వలేం
అనంతపల్లి (నల్లజర్ల): తాడిపూడి, పోలవరం కాలువల తవ్వకంలో తమ భూములన్నీ పోయాయని, మిగిలిన కాస్త పొలాన్ని రోడ్డు విస్తరణలో తీసుకుంటామంటున్నారని, ఇలా అయితే తామెలా బతకాలని నల్లజర్ల మండలంలోని అనంతపల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణకు ప్రత్యమ్నాయ మార్గం చూడాలంటూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ణప్తి చేస్తున్నారు. సోమవారం రైతులు గద్దే జయహరి రావు, గన్నమని ప్రసాదు, భోగవల్లి శ్రీనివాస్, జాలపర్తి సత్యనారాయణ, తాతిన చైతన్య విలేకరులతో మాట్లాడారు. కొంత భూమి గతంలో రోడ్డు విస్తరణలో, మరికొంత భూమి తాడిపూడి కాలువు, పోలవరం కాలువ తవ్వకాల్లో పోయిందని అన్నారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ తమకు ఇలా భూములు పోతుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు.
ఏడు తరాలుగా ఈ భూములు సాగుచేసుకుంటున్నామని, ఉన్న నాలుగెకరాల్లో మూడెకరాలు ఇప్పుడు రోడ్డు విస్తరణలో పోనుందని రైతు గన్నమని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. భూములు సేకరించే ముందు కనీసం రైతులతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదన్నారు. ప్రస్తుతం ఉన్న రహదారి పక్కనే అవసరమైనంత ప్రభుత్వ భూమి ఉండగా రైతుల భూములు తీసుకోవడం సమంజసం కాదంటున్నారు. గన్నమని రామదుర్గా ప్రసాద్, బోయపాటి సుబ్బారావు, మద్దిపాటి రామకష్ణ, గద్దే యజ్ణేశ్వరావు ఉన్నారు.