ఆసుపత్రుల్లో స్వచ్ఛత కోసమే ‘కాయకల్ప’
-
ప్రొగ్రాం అధికారి డాక్టర్ దుర్గప్రసాద్
బాన్సువాడ :
ప్రభుత్వ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ‘కాయకల్ప’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రొగ్రాం అధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని బుధవారం ఆయన పరిశీలించారు. గర్భిణుల వార్డు, మేల్, ఫిమేల్ వార్డులు, పిల్లల విభాగాన్ని, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, ప్రసూతి విభాగాన్ని, స్టాఫ్ రూంలను, పడకలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘కాయకల్ప’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతను పాటించే ఆసుపత్రులను ఎంపిక చేసి, గ్రేడింగ్ ఇస్తుందని, తద్వారా ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరవుతాయన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని వైద్యవిధాన పరిషత్ ద్వారా కొనసాగుతున్న బాన్సువాడ, నాగారెడ్డిపేట, నవీపేట, కమ్మర్‌పల్లి ఆసుపత్రులకు 70 శాతం స్వచ్ఛత గ్రేడింగ్ లభించిందన్నారు. నివేదికను అందజేసిన తరువాత ‘కాయకల్ప’కు సంబంధించిన లబ్ధి చేకూరుతుందన్నారు. ఆయన వెంట నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ అధికారి డీ వెంకటయ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శ్రీనివాస్‌ప్రసాద్, డాక్టర్ విజయ్ భాస్కర్, డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు.